సవ్యసాచి మూవీ రివ్యూ

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, రావు రమేష్, వెన్నెల కిషోర్, దిషిత సెహగల్, హైపర్ ఆది, తాగుబోతు రమేష్, భరత్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: కీరవాణి
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, మోహన్, రవి శంకర్
దర్శకత్వం: చందు మొండేటి

జోష్ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని కుర్రోడు నాగ చైతన్య రెండో చిత్రమైన ఏమాయ చేసావేతోనే హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఏమాయ చేసావేలో లవర్ బాయ్ ల కనబడిన నాగ చైతన్య తర్వాత మాస్ మాస్ అంటూ ఆటో నగర్ సూర్య, దడ, బెజవాడ సినిమాల్తో చేతులు కాల్చుకున్నాడు. మాస్ చిత్రాలు చేస్తే మాస్ హీరోగా స్టార్ హీరో అవ్వొచ్చు అనుకున్న చైతు కి మాస్ అంటూ చేసిన ప్రతి చిత్రం దెబ్బేసింది. అయినా మనోడు మాత్రం మాస్ ని వదలనే లేదు. ప్రేమమ్ తో మళ్ళీ గాడిన పడ్డ చైతు యుద్ధం శరణం అంటూ డిజాస్టర్ అందుకున్నాడు. ఇక సమంత తో పెళ్లి తర్వాత అయినా ఫేట్ మారుతుందనుకుంటే… ఎన్నో అంచనాలతో మారుతీ దర్శకత్వంలో తెరక్కేక్కిన శైలజ రెడ్డి అల్లుడు కూడా నాగ చైతన్య కి యావరేజే మిగిల్చింది. అయితే ప్రేమమ్ తో భారీ హిట్ అందుకున్న నాగ చైతన్య మళ్ళీ ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటి తో సవ్యసాచి అనే డిఫ్రెంట్ సబ్జెక్టుతో మాస్ ఎలిమెంట్స్ కూడిన కామెడీ ఎంటెర్టైనెర్ ని చేసాడు. ఇప్పటి వరకు నాగచైతన్యకు పక్కా కమర్షియల్ హిట్ దక్కలేదనే చెప్పాలి. అందుకే ఈసారి మైత్రీ మూవీస్ లాంటి విజయవంతమైన బ్యానర్‌తో జతకట్టాడు చైతు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి భారీ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీస్ ఇప్పుడు సవ్యసాచిని భారీగానే తెరకెక్కించింది. నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇంకా ఈ సినిమాకి అదనపు బలం తమిళ హీరో మాధవన్ విలన్ గా నటించడం, అలాగే చైతు అక్కగా మాజీ హీరోయిన్ భూమిక కనబడడం. అంతేకాకుండా బాలీవుడ్ గ్లామర్ భామ నిధి అగర్వాల్ చైతు కి జోడిగా ఈ చిత్రంలో నటించడం వంటి ఆసక్తికర విషయాలతో నేడు సవ్యసాచి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఏడాది శైలజారెడ్డి అల్లుడుతో హిట్ అందుకోలేకపోయిన చైతు సవ్యసాచి తో అయినా హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఆదిత్య, విక్రమ్(నాగ చైతన్య) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టడం వలన విక్రమ్ రెండు చేతులకి ఒకేలాంటి బలం ఉంటుంది. విక్రమ్ కి అక్క పావని( భూమిక) కూతురు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం. తన తల్లే అక్క కూతురిగా పుట్టిందని నమ్మకంతో విక్రమ్ మహాలక్ష్మిని ప్రాణంగా చూసుకుంటాడు. అనుకోని కారణాలతో విడిపోయిన తన ప్రేమికురాలు చిత్ర(నిధి అగర్వాల్)తో విక్రమ్ కలిసిపోయి హ్యాపీగా ఉంటాడు. మరోవైపు కావాలనుకున్నదాన్ని ఎవరైనా దూరం చేసినా తట్టుకోలేని మేధావి అరుణ్. తనని విమర్శించిన వారిని, తనకు ఏదైనా దక్కనివ్వని వారిని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి వ్యక్తి విక్రమ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. వాళ్లని అంతం చేయాలనుకుంటాడు. అందులో భాగంగానే విక్రమ్ మేనకోడలు మహాలక్ష్మిని కిడ్నాప్ చేయిస్తాడు. అయితే ఆ కిడ్నప్ వెనుక అరుణ్ (మాధవన్) ఉన్నాడని విక్రమ్ తెలుసుకుంటాడు. ఇంతకీ అరుణ్ ఎవరు? అరుణ్ ఎందుకు విక్రమ్ మేనకోడలు మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు? అసలు విక్రమ్ కి అరుణ్ కి ఉన్న మధ్యన ఉన్న సంబందం ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సవ్యసాచిని వెండితెర మీద పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:

విక్రమ్ పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నాగచైతన్య మంచి నటన కనబరిచాడు. విక్రమ్ పాత్రకు నాగచైతన్య పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటిలానే మంచి ఎనర్జీతో చైతూ ఆకట్టుకున్నాడు. గత సినిమాల్లో నటన కన్నా ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు. అలాగే ఫైట్లు ఇరగదీశాడు. చైతు ఈసారి డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ముఖ్యంగా నిన్ను రోడ్డు మీద పాటలో చైతూ డ్యాన్స్ బాగుందనే కాప్లిమెంట్స్ అయితే పడతాయి. క్లాసీ విలన్ పాత్రలో మాధవన్ అలరించాడు. హీరోకి ధీటుగా విలన్ మాధవన్ పాత్రను దర్శకుడు చందు డిజైన్ చేసాడని సవ్యసాచి ట్రైలర్ లో అనిపించింది. కానీ మాధవన్ పాత్ర సవ్యసాచిలో అనుకున్నట్టుగా కనిపించదు. అరుణ్ గా మాధవన్ విలన్ పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్ర గొప్పగా లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసాడు. హీరయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ గా కనిపించింది అంతే కానీ నటనపరంగా ఆమె చాలా ఇంప్రూవ్ కావాల్సి వుంది. అందాల ఆరబోతలో నిధి ఎక్కడా తగ్గలేదు. తాను గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అని ఈ సినిమాతో లీకులిచ్చింది. భూమిక మాత్రం తెర మీద కనిపించింది కొద్దీసేపైనా తన నటన తో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ రామన్, రావు రమేశ్, తాగుబోతు రమేశ్, షకలక శంకర్, భరత్ రెడ్డి తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

బాహుబలితో ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన సంగీత దిగ్గజం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. కీరవాణి అందించిన నేపధ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాల్లో ప్రేక్షకుడు కంటతడి పెట్టించేలా ఉంది. అంత గొప్పగా బ్యాగ్రౌండ్ స్కోర్ సవ్యసాచికి ఇచ్చాడు. ఇక మ్యూజిక్ పరంగా రెండు పాటలు బాగున్నాయి. ఇక ఈ సినిమాకి మరి ప్లస్ పాయింట్ జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ. చాలా సన్నివేశాలను ఆకట్టుకునేలా చూపించాడు. హీరో హీరోయిన్లను మాత్రం యువరాజ్ చాలా అందంగా చూపించాడు. అలాగే యాక్షన్ సన్నివేశాల ను కూడా కెమరాతో గొప్పగానే ప్రెజెంట్ చేసాడు. ఇక కోటగిరి ఎడిటింగ్ లో బోలెడన్ని లోపాలున్నాయి. చాలా చోట్ల కటింగ్ వెయ్యాల్సి ఉంది కానీ.. అలానే ఒదిలేశారనిపిస్తుంది. ఈ సినిమా కి ప్రధాన లోపం ఎడిటింగ్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

విశ్లేషణ:

కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో ఆకట్టుకున్న చందు మొండేటి నాగ చైతన్య హీరోగా పెట్టి సవ్యసాచి సినిమాని తెరకెక్కించాడు. సవ్యసాచి అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ కథను చందు మొండేటి సినిమాగా మలిచాడు. కొంతమంది తల్లి గర్భం నుండి కవలలుగా జన్మించిన.. వారికీ అనేక లక్షణాలు ఒకేలా ఉంటాయి. అయితే కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడం.. లోపలున్న మరో వ్యక్తి బయటికి కనిపించే వ్యక్తికి తెలియకుండా స్పందించడం.. అనేది ఈ సవ్యసాచి కథ. కథ అంతా కొత్తగా అనిపిస్తుంది. కానీ దర్శకుడు చందు ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌ ను సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ బాగున్నప్పటికీ… కథనం చాలా సాదాసీదాగా ఉంది. ఫస్ట్ హాఫ్ మరీ బోరింగ్ అనిపిస్తుంది. హీరో పరిచయం, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో బాగానే నడిపించినప్పటికీ.. అంతగా ప్రేక్షకుడు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే ఇంటర్వల్ చూసిన ప్రేక్షకుడు ఇక సెకండాఫ్‌లో విలన్ అరుణ్(మాధవన్), హీరోల నాగ చైతన్యల మధ్య మైండ్ గేమ్ అదిరిపోతుందని అనుకునేలోపు… ఆ క్యూరియాసిటీని కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్ లో విలన్ కి హీరోకి మధ్యన మైండ్ గేమ్‌ను దర్శకుడు ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. స్క్రీన్‌ప్లే ప్రధానమైన ఇలాంటి మైండ్ గేమ్‌లో అదే ప్రధాన లోపంగా కనిపించింది. ఇరాక్ ఇలా థ్రిల్లింగ్ తో సాగే కథలో దర్శకుడు కామెడిని ఇరికించే ప్రయత్నం చేసాడనిపిస్తుంది. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ దృష్టి లో పెట్టుకొని అనవసరమైన మరియు కథకు అక్కర్లేని కామెడీ సన్నివేశాలు పెట్టడం కూడా సినిమా ఫ్లో ని దెబ్బ తీసింది. శుభద్ర పరిణయం నాటకంలో ఉన్న సన్నివేశాలు అలానే అనిపిస్తాయి. ఇక సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప… ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయ్యేది మాత్రం ఎడమ చేతి ఎమోషన్‌కి. విక్రమ్ ఆపదలో ఉన్నప్పుడు, ఎక్కువగా ఆనందం పొందుతున్నప్పుడు ఎడమచేయి స్పందించే తీరు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ కాన్సెప్ట్ బాగా పండింది. ఏదైనా చందు మొండేటి మాత్రం కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో మెప్పించినా… సవ్యసాచితో నిరాశపరిచాడనే చెప్పాలి. ఇక నాగచైతన్య కి వరసగా మూడో సినిమా కూడా దెబ్బకొట్టిందనే చెప్పాలి. చూద్దాం పోటీ లేకుండా సోలోగా ఈ వారంలో బరిలోకి దిగిన నాగ చైతన్య… విజయ్ సర్కార్ వచ్చెలోపు ఏ మాత్రం కలెక్షన్స్ రాబడతాడో అనేది.

ప్లస్ పాయింట్స్: నాగ చైతన్య నట, విలన్ గా మాధవన్ నటన, కథ, రెండు మూడు పాటలు, ప్రీ క్లైమాక్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: కథనం, కాలేజ్ ఎపిసోడ్, ఫస్ట్ హాఫ్, మైండ్ గేమ్, ఎడిటింగ్

రేటింగ్: 2.25/5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*