విశ్వరూపం 2 మూవీ రివ్యూ

బ్యానర్: ఆస్కార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ కమల్ ఫిలిమ్స్

నటీనటులు: కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్

మ్యూజిక్ డైరెక్టర్: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: సాను వరగేసే (శాందత్ సాయినుద్దీన్)

ఎడిటింగ్: మహేష్ నారాయణ్

నిర్మాత: కమల్ హాసన్

దర్శకత్వం: కమల్ హాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ సినిమాలంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంత మందుంటారో అనేది చెప్పడం చాలా కష్టం. కమల్ హాసన్ సినిమాలకు రెగ్యులర్ ఫాన్స్ తో పాటుగా స్పెషల్ ఫాన్స్ కూడా ఉంటారు. గతంలో కమల్ హాసన్ సినిమాలకున్న క్రేజ్ ని చూస్తే ఇతర హీరోలకు అసూయ పుట్టేది. కానీ ఈమధ్యన కమల్ హాసన్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా లు కాంట్రవర్సీలకు నెలవుగా మారుతున్నాయి. విశ్వరూపం సినిమా అప్పుడు కమల్ హాసన్ పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఆ సినిమా టైం లో కమల్ హాసన్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టానని చెప్పి బోరుమన్నాడు. తాజాగా విశ్వరూపం సినిమాకి సీక్వెల్ గా విశ్వరూపం 2 సినిమాని తాను హీరోగా నటించడమే కాదు… తానే ఆ సినిమా ని డైరెక్ట్ చెయ్యడం.. అంతేకాకుండా ఆ భారీ ప్రాజెక్ట్ కి నిర్మాత కూడా కమల్ హాసన్ కావడం విశేషం. ఎప్పుడో మొదలైన విశ్వరూపం 2 అనేక అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన కమల్ హాసన్ కష్టానికి ప్రేక్షకుల తీర్పు ఏమిటనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

విశ్వరూపం సినిమా కి సీక్వెల్ అయినా ఈ విశ్వరూపం 2 కథలోకి వెళితే… లండన్, అమెరికాలో ఏవో పన్నాగాలు జరుగుతున్నాయని తెలిసి వాటిని చేధించే పనిలో పడతారు విసామ్ అహ్మద్ కాశ్మీరి (కమల్ హాసన్) టీమ్ సభ్యులు. అందులో భాగంగానే రా ఏజెంట్ గా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై తన టీమ్ సభ్యులు (శేఖర్ కపూర్, ఆండ్రియా) సహాయంతో ఒక మిషన్ మొదలుపెడతారు. విసామ్ తో పాటు ఉన్నప్పుడు దాడిలో చనిపోయాడు అని అనుకున్న ఒమర్(రాహుల్ బోస్)తిరిగి వస్తాడు. పాకిస్తాన్ చేరుకున్న విసామ్ ఒక తీవ్రవాద సంస్థలో చేరి వారి కార్యకలాపాల గురించి భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. విసామ్ తీవ్రవాద రహస్యాన్ని డీకోడ్ చేసి అల్-ఖైదా గ్యాంగ్ హెడ్ ను హతమార్చే ప్రయత్నం చేస్తాడు. మరి విసామ్ అల్-ఖైదా గ్యాంగ్ హెడ్ ను హతమారుస్తాడా? అసలు విసామ్ అహ్మద్ తలపెట్టిన మిషన్ కంప్లీట్ అవుతుందా? అనేది విశ్వరూపం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:

కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులోనూ కమల్ హాసన్ ఇంకా ఇంకా కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాకపోతే గతంలోలా వెరైటీ పాత్రలు జోలికి గత కొంత కాలంగా పోవడం లేదు. ఎప్పుడూ యాక్షన్ యాక్షన్ అంటూ ఏవో చేసిన సినిమాలనే తిప్పి తిప్పి చేస్తున్నాడనిపిస్తుంది. ఇక విశ్వరూపం 2 సినిమాలో కమల్ హాసన్ ఎప్పటిలాగే అటు యాక్షన్ సన్నివేశాలలో ఇటు ఎమోషనల్ సీన్స్ లో బెస్ట్ ఇచ్చేసాడు. కమల్ హాసన్ ఒక రా ఏజెంట్ గా తన పాత్రతో పూర్తిగా మెప్పించాడు. ఉగ్రవాదులకు సంబందించిన సన్నివేశాల్లో కమల్ నటన అద్భుతమని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో కూడా ప్రత్యేకమైన నటన ఆకట్టుకుంటుంది. కాకపోతే తనకు ఛాలెంజ్ ఇచ్చే పాత్రను డిజైన్ చేసుకోవడంలో తనలోనే ఉన్న దర్శకుడు ఫెయిల్ కావడంతో ఇందులో విసామ్ పాత్ర చాలా మాములుగా అనిపిస్తుంది. హీరోయిన్ పూజా కుమార్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం రొమాన్స్ కోసం తప్ప పెద్దగా ఉపయోగపడింది లేదు. మరో హీరోయిన్ ఆండ్రియా మాత్రం పూజ మీద బెటర్ పెరఫార్మెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా హాట్ గా, గ్లామర్ గా, క్యూట్ గా కనిపించింది. రాహుల్ బోస్ పాత్ర విశ్వరూపం సినిమా నుండి కంటిన్యూ అయ్యింది కాబట్టి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. మిగతా నటీనటులు అంటే శేఖర్ కపూర్ ఇంకా ఇతర నటీనటులు సో సో గా మెప్పించారు.

విశ్లేషణ:

ఈ సినిమాకి హీరో, డైరెక్షన్, నిర్మాత కమల్ హాసన్ చెయ్యడం… అసలు కొత్తదనం లేని కథతో.. సినిమాని డైరెక్ట్ చెయ్యడం, అందులోనూ హీరోగా నటించడం, ఇక అన్ని అమ్ముకుని సినిమాని నిర్మించడం అనేది ఎంత పొరపాటో విశ్వరూపం 2 సినిమా చూస్తుంటే అర్ధమవుతుంది. విశ్వరూపం సినిమా అప్పుడు సినిమా లో ఎన్ని మైనస్ లు ఉన్నప్పటికీ… కమల్ సినిమా కాబట్టి.. సినిమాలో ఉన్న నెగెటివ్స్ ఉన్నప్పటికీ -.. కొట్టుకుపోయాయి. కానీ ఆ సినిమాకి సీక్వెల్ అంటే ఇందులో ఎమన్నా కొత్తదనం కోసం వెతుకుతారు. కానీ విశ్వరూపం 2 సినిమాలో కొత్తదనం మాట దేవుడెరుగు… విశ్వరూపం సినిమా మొదటి పార్ట్ చూస్తున్నట్టు అనిపించింది అంటే.. ఆ సినిమా లో పలు సీన్స్ ని మళ్లీ 2 లో రిపీట్ చేసినట్టు ఈజీగా అర్ధమవుతుంది. 2013 లో వచ్చిన విశ్వరూపం సినిమా చూసిన ప్రేక్షకులకు ఎంతవరకు ఆ సినిమా గుర్తుందో తెలియదు కానీ.. ఆ సినిమా చూసాక ఈ సినిమా చూద్దాం అంటే అంతకన్నా దండగ పనేమీ ఉండదు. అసలు ఒక సిరీస్ లో ఉండాల్సిన సన్నివేశాలు సీరియల్ తరహాలో సాగుతూ ఉన్నది రెండు గంటలే అయినా నాలుగు గంటల ఫీలింగ్ కలిగిస్తాయి.తన రొమాంటిక్ మూడ్ ని ప్రదర్శించే తీరాలన్న కమల్ ఆత్రం ఓ పాట ద్వారా బయటపడిపోయింది. సీరియస్ సన్నివేశాల మధ్య అనవసరమైన ఇద్దరు హీరోయిన్ల ట్రాక్ విసిగిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమి లేదు. వర్తమానం కంటే ఫ్లాష్ బ్యాక్ నయం అనిపించింది. విశ్వరూపం 2 టెంపోతో కీలకమైన కథ కూడా బాలన్స్ తప్పింది. ఫలితంగా ఉద్వేగంగా సాగాల్సిన స్టోరీ నీరసంగా సాగుతూ ఇంటర్వెల్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది. అండర్ కవర్ టెర్రరిస్టుగా ఉన్నప్పుడు కమల్ పాత్రను అడ్వెంచరస్ గా తీర్చిదిద్దాల్సింది పోయి ఏదో బిబిసి డాక్యుమెంటరీ కోసం తీస్తున్నట్టుగా టేకింగ్ ఉండటం విశ్వరూపం 2 మెయిన్ మైనస్. సెకండ్ హాఫ్ లో కొన్ని పోరాట సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి చాలా తక్కువగా ఉంచారు. అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు కమల్ హాసన్ సినిమానేనా అనే డౌట్ మాత్రం ప్రేక్షకుడికి ప్రతి నిమిషం కలుగుతుంది అంటేనే… సినిమా ఫలితం ఏంటనేది పూర్తిగా అర్ధమవుతుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ పాటల్లో తేలిపోయి… బ్యాగ్రౌండ్ ని బాదేసింది. జిబ్రాన్ ఇచ్చిన నేపధ్య సంగీతం కాసేపు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చేబెట్టింది అంటే… సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందనేది దాని మీనింగ్. యాక్షన్ సన్నివేశాల్లో, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లోనూ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. సాను వరగేసే, శాందత్ సాయినుద్దీన్ సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా వుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ కెమెరా పనితనం కనబడుతుంది. ఇక ఎడిటింగ్ ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. సినిమాకి కరెక్ట్ గా ఎడిటింగ్ లో కత్తెర పడితే.. సినిమా మొత్తం మీద గంట కూడా ఉండేది కాదేమో. అన్ని ఎడిటింగ్ సీన్స్ సినిమాలో కనబడతాయి. ఇక నిర్మాణ విలువలు సినిమాని రిచ్ లుక్ లో చూపెట్టాయి.

ప్లస్ పాయింట్స్: కమల్ హాసన్ నటన, కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: కథ, కథనం, యాక్షన్ ఎపిసోడ్స్, ఫస్ట్ హాఫ్, ఎడిటింగ్, మ్యూజిక్

రేటింగ్: 2.0/5