కార్పొరేట్‌ బురద కడుక్కోడం చాలా కష్టం!

రాజకీయ నాయకుల అవినీతి గురించి లెక్కకు మిక్కిలిగా నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులను కదిలిస్తే.. తమకు కిట్టని అధికార పార్టీ నేతల గురించి పుంఖాను పుంఖాలుగా అవినీతి కథలు వినిపిస్తూ ఉంటారు. అయితే ప్రజల ఆలోచనల మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు చూపించే ప్రభావం చాలా తక్కువ. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల అవినీతి గురించి చెప్పే మాటలు నిజమే కావొచ్చు గాక.. కానీ జనం వాటిని నమ్మడం తక్కువైపోయింది. రాజకీయాల్లో కిట్టనివారి గురించి బురద చల్లడం కామన్‌ అనుకుని, అవన్నీ నిజం అని తేలినప్పుడు చూద్దాంలే అని జనం తేలిగ్గా తీసుకుంటున్నారు.

అయితే కార్పొరేట్‌ వ్యాపార సంస్థల పరిస్థితి వేరు. సాధారణంగా ప్రభుత్వాల్ని మంచి చేసుకుని, తద్వారా వ్యాపార ప్రయోజనాల్ని మెరుగుపరచుకోవడం వరకు మాత్రమే ఈ కార్పొరేట్‌ కంపెనీలు దృష్టి పెడతాయి. అంతే తప్ప సాధారణంగా రాజకీయ నాయకులతో ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీలతో సున్నం పెట్టుకోవు. వారు అవినీతి లంచం సొమ్ములు ఆశిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఇచ్చేసి.. తమ పబ్బం గడుపుకోవడం వరకే చూస్తాయి. వారివి గొంతెమ్మ కోరికలు అయితే.. తమ వల్ల కాదంటూ.. మిన్నకుండిపోతాయి. అంతే తప్ప సాధారణంగా.. అధికార పార్టీ నాయకుల మీద రోడ్డున పడి కార్పొరేట్‌ కంపెనీలు ఆరోపణలు చేయడం, బురద చల్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అదే జరిగింది. అక్కడ వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు చేసింది ఏ వైకాపా నాయకులో అయితే జనం పట్టించుకునే వారు కాదేమో.. కానీ.. రాపూరు- కృష్ణపట్నం పనులు రైల్వే లైను పనులు చేస్తున్న మాంటోకార్లో కంపెనీ వారు ఈ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తమను అయిదు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని, బలవంత పెడుతున్నారని.. పనులకు ఆటంకం కల్పిస్తున్నారని మాంటోకార్లో కంపెనీ కార్యదర్శి కల్వేష్‌ దేశాయ్‌ ఆరోపించారు. కార్పొరేట్‌ కంపెనీలు నేతల మీద ఆరోపణలు చేయడం చాలా అరుదైన సంగతి. అందుకే ఈ కార్పొరేట్‌ లు చల్లిన బురదను కడుక్కోవడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నానా పాట్లు పడుతోంది.

రామకృష్ణ సహజంగా ఈ ఆరోపణలను ఖండిస్తారనేది అందరికీ తెలిసినదే. అయితే ఈ బురద మొత్తం పార్టీకి అంటుకునేలా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాత్రం.. ఈ ఆరోపణలకు వెంకటగిరి ఎమ్మెల్యేనే తనంతగా వివరణ ఇస్తారంటూ.. తమ బాధ్యతలేకుండా పక్కకు తప్పించుకుంటున్నారు. అయితే కల్వేష్‌ దేశాయ్‌ మాటల్లో ఓ కీలక విషయం ఉంది. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే వేధింపుల గురించి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం అంటే ఎవరు.. సాక్షాత్తూ సీఎం దృష్టికి కూడా ఈ వ్యవహారం ముందే వెళ్లిందా? చంద్రబాబు కూడా పట్టించుకోలేదా? అనేవి చర్చనీయాంశాలు. అలాంటి రుజువులు గనుక బయటపడితే.. రామకృష్ణ అవినీతి బాగోతం మొత్తం ప్రభుత్వం మీదనే బురద మరకగా మారే ప్రమాదం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*