కొత్త పంథాలో సొంతముద్ర వేయనున్న లోకేష్‌

నారా లోకేష్

 

తెలుగుదేశ పార్టీ ఎమ్మెల్యేలకు మూడురోజుల వర్క్‌షాప్‌ జరగబోతోంది. ఎమ్మెల్యేలకు ముమ్మరంగా శిక్షణ కార్యక్రమం ఉంటుంది. విజయవాడలోని కెఎల్‌ యూనివర్సిటీలో ఈ శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడురోజుల వర్క్‌షాప్‌లో హాజరయ్యే వారికి ఒకింత ఖాళీ కూడా లేకుండా.. టైట్‌ షెడ్యూల్‌ క్లాసులు, చర్చలు ఉన్నాయి. పైగా వారిని బయటకు కూడా వెళ్లనివ్వకుండా వసతి సదుపాయాలు కూడా యూనివర్సిటీలోనే ఏర్పాటుచేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వర్క్‌షాప్‌ నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భావినేతగా ఎదిగే క్రమంలో ఉన్న నారా లోకేష్‌ తనదైన శైలిలో సొంత ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సాదారణంగా ఈ వర్క్‌షాపుల్లో కీలకంగా ఉండే నేతలు సుదీర్ఘ ప్రసంగాలు చేసి, కీలక విషయాలను చర్చిస్తారు. ఇందులో కూడా అదే తరహాలో ప్లాన్‌ చేశారు. నియోజకవర్గాల వారీగా ఆర్థిక, సామాజిక సూచీల ప్రకారం సాధించిన అభివృద్ధి, పెట్టుకోవాల్సిన లక్ష్యాల గురించి చంద్రబాబునాయుడు చెబుతారు. అలాగే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ దాని ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాల గురించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతారు. నారా లోకేష్‌ మాత్రం సింపుల్‌ గా పార్టీ సభ్యత్వ డ్రైవ్‌ గురించి ప్రసంగిస్తారు.

కానీ వర్క్‌షాప్‌ షెడ్యూలు మొత్తం నారా లోకేష్‌ ఆలోచనల ప్రకారమే ఉన్నట్లుగా స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రధానం గా సీఎం వాడే డ్యాష్‌ బోర్డు, సాంకేతిక కొత్త విధానాలు, ఇత్యాది విషయాల గురించి ఎమ్మెల్యేలకు ప్రతినిధులకు అర్థమయ్యేవరకు వివరించబోతున్నారు. ఇవన్నీ కూడా లోకేష్‌ బుర్రలోంచి పుట్టిన అయిడియాలే. ఏతావతా.. ఈ వర్క్‌షాప్‌ జరిగిన మూడురోజులపాటూ లోకేష్‌ సభలో వేదిక ఎక్కి మాట్లాడేది తక్కువగానూ.. లోకేష్‌ గురించి ఆయన ఆలోచనలు, సాంకేతిక ప్లాన్‌ ల గురించి ప్రతినిధులంతా మాట్లాడుకునే వాతావరణం ఎక్కువగానూ ఉండబోతోంది. లోకేష్‌ సభ్యత్వ డ్రైవ్‌ గురించి మాత్రమే మాట్లాడేటప్పటికీ, మిగిలిన దాదాపు చాలా తరగతులు లోకేష్‌ పాత్ర గురించి ఎక్కువ ప్రస్తావించే వాతావరణం ఉండేలా కార్యక్రమాల తరగతుల రూపకల్పన ఉంది.

అన్యాపదేశంగా.. లోకేష్‌ పార్టీ జాతీయ కార్యదర్శిగా చాలా కొత్త పంథాలో పార్టీని నడుపుతున్నారని, ప్రభుత్వం సాంకేతికంగా అద్భుతమైన కొత్త పద్ధతుల్లో ముందుకు పురోగమించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని ఎమ్మెల్యేలంతా నమ్మేలాగా, చర్చించుకునేలాగా ఈ వర్క్‌షాప్‌ జరుగుతుంది. వర్క్‌షాప్‌కు మొత్తం 224 మందిని ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు 175 మందికాగా, ఎంపీలు, లోక్‌సభ ఇన్చార్జిలు, రాజ్యసభ సభ్యులు, 13 జిల్లాల అధ్యక్షులు, కొందరు కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిలోనూ మూడురోజుల పాటూ ఈ వర్క్‌షాప్‌ రూపేణా.. నారా లోకేష్‌ తెలివితేటలు, మేథస్సు, సామర్థ్యం గురించిన చర్చ నడిచేలా వర్క్‌షాప్‌ రూపకల్పన ఉన్నదని ఎవరికైనా అనిపిస్తే అందులో సందేహం ఏముంది?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*