టెక్నాలజీ మేనియా చంద్రబాబును ఎటు తీసుకెళ్తుందో?

తనను మించిన గొప్ప ఎడ్మినిస్ట్రేటర్ లేరనే పేరు తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తొలినుంచి కోరిక. గతంలో తొమ్మిదేళ్ల పాటు ఆయన పాలన సాగించినప్పుడు.. హైటెక్ టెక్నాలజీని తొలిసారిగా పరిపాలన వ్యవస్థలోకి తీసుకువచ్చారు. దానికి ఫలితంగా దేశంలో ఇప్పటిదాకా ఎవరికీ దక్కనంతగా హైటెక్ ముఖ్యమంత్రి అనే కీర్తి ఆయనకు దక్కింది.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న సమయానికి టెక్నాలజీ అనేది మరిన్ని కొత్త పుంతలు తొక్కింది. ఎన్నో రూపాల్లోకి మారింది. చంద్రబాబు సహజంగానే కొత్త టెక్నాలజీని మొత్తం ముందుగా తానే అందిపుచ్చుకుని కీర్తి గడించాలని చూసే రకం.

అయితే క్షేత్రస్థాయిలో ఉండే సంభావ్యతలను , పరిమితులను తను మోడల్ గా తీసుకుంటున్న విదేశాలలో పరిస్థితులను, మన రాష్ట్రంలోని పరిస్థితులను పోల్చి చూసుకోకుండా.. కొన్ని రంగాల్లో అలాగే సాంకేతికతను వినియోగించాలనుకుంటున్న ఆయన ఆలోచనలు చిత్రంగా కనిపిస్తున్నాయి.

chandrababu-2
రాష్ట్రంలో పంటల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి డ్రోన్ల ను వినియోగించే పద్ధతి తీసుకురావాలని చంద్రబాబు చూస్తున్నారట. అంటే డ్రోన్ల ద్వారా పంటలు ఎక్కడైనా ఎండిపోతూ ఉంటే గుర్తించి, నివారణ లేదా కాపాడే చర్యలు చేపడతారన్నమాట. అయినా వందల వేల ఎకరాల విస్తీర్ణంలో ఒకే తరహా పంటలు సాగుచేసే, మాన వనరులు తక్కువగా ఉండే విదేశాల్లో అది పద్ధతే గానీ, అనువుగా ఉంటుంది గానీ.. నాలుగైదు ఎకరాల చిన్న కమతాలు తప్ప పెద్ద విస్తీర్ణాలు ఉండని మన రాష్ట్రంలో అలాంటి చిత్రమైన పోకడలు ఎందుకు అనేది రైతుల ప్రశ్న.
అయినా రాష్ర్టంలో పంటల పరిస్థితి ఎలా ఉన్నది అనేది వాస్తవంగా తెలుసుకోవాలంటే.. డ్రోన్లు అక్కర్లేదు.. అన్నదాతల పూరిగుడిసెల్లో చప్పిడి మెతుకులు తింటున్నారా.. పరమాన్నం వండుకున్నారా గమనిస్తే చాలు. అన్నదాతల ఆత్మహత్యల గణాంకాలను చిత్తశుద్ధితో ఆమోదిస్తే చాలు.. రాష్ట్రవ్యాప్తంగా సేద్యం ఎలా కునారిల్లుతున్నదో.. వర్తమానంలో దాని అధోగతి ఎలా ఉన్నదో పాలకుల కళ్లకు కడుతుంది. డ్రోన్లకు, కెమెరాలకు సాంకేతిక హంగులకు తగలేసే సొమ్మును ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ప్రతి రైతుకూ పంట బీమా చేయిస్తే చాలు.. వారి కన్నీళ్లను కొంతమేరకైనా తుడిచే ప్రయత్నం చేసినట్లు అవుతుంది. మరి చంద్రబాబునాయుడు ఈ వాస్తవాల్ని అంగీకరించగలరో లేదో??

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*