పోల్చి అడగడం విజ్ఞత కాదు

తెలంగాణ గళాన్ని నిర్మొగమాటంగా వినిపించడంలో కేసీఆర్‌ కూతురు నిజమాబాద్‌ ఎంపీ కవిత కూడా చాలా ముందంజలోనే ఉంటుంటారు. చాలా సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారుతూ ఉంటాయి. అయితే.. ఉద్యమ నాయకురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె గళంలోని తీవ్రత అలాగే ఉంటుందంటూ పలువురు సమర్థిస్తూ ఉంటారు కూడా. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ప్రజాజీవనానికి నష్టం కలిగించిన నేపథ్యంలో ఎంపీ కవితి చేస్తున్న ఒక డిమాండు అనుచితంగా కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారీ వర్షాలకు తెలంగాణలో హైదరాబాదు నగర ప్రజాజీవితం మొత్తం అస్తవ్యస్తంగా మారడం మినహా రాష్ట్ర రైతాంగానికి వాటిల్లిన నష్టం పరిమితమైనది. నష్టం లేదనలేం గానీ.. రైతులు కుప్పకూలిపోయేంత పరిస్థితి లేదు. ఇప్పుడు ఏరీతిగా అయినా మాట్లాడుతూ ఉండవచ్చు గానీ.. తెరాస నాయకులు కూడా.. వర్షాలు కురుస్తున్న సమయంలో పంట నష్టాల గురించి, రైతుల కష్టాల గురించి వాటిల్లుతున్నట్లుగా మాట్లాడలేదు… ప్రాజెక్టులు నిండుతున్నాయని, జలకళ వచ్చేసిందని, మిషన్‌ భగీరథ సఫలం అయిందని మురిసిపోవడం మాత్రమే జరిగింది.

అదే సమయంలో అందుతున్న సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. అక్కడ భారీ వర్షాలకు జరిగిన నష్టం మొత్తం.. పంట పొలాలకే జరిగింది. రైతులకే ఎక్కువ నష్టం వాటిల్లింది. అందుకే ఆ రాష్ట్రం రైతులను ఆదుకోవడానికి కేంద్ర సాయం కోసం అర్రులు చాస్తోంది.

అయితే ఇలాంటి కీలక సమయంలో.. కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిని ప్రత్యేకించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ముడిపెట్టే ప్రయత్నం చేయడం విశేషం. వెంకయ్యనాయుడు ఏపీలో పంట నష్టం గురించి మాత్రమే మాట్లాడుతున్నారని.. అది కరెక్టు కాదని.. ఏపీకి, తెలంగాణకు సమానంగా సాయం అందించాలని కవిత కోరుతున్నారు. ‘సమాన సాయం’ అనేది చాలా చిత్రమైన పదంలాగా కనిపిస్తోంది. ఇదేమీ సంక్రమిస్తున్న ఆస్తుల పంపంకం కాదు సమాన న్యాయం చేయడానికి, వారికి వాటిల్లిన నష్టం దామాషాలో సాయం ఉండాలని అడగాలే తప్ప.. వారికి ఇచ్చినంత మాక్కూడా ఇవ్వండి అని అడగడం ఏ రకంగా సబబు అనిపించుకుంటుంది. పైగా కేంద్రం మీద కూడా తొందరపాటు నిందలు వేసేయకుండా, ముందు తమ రాష్ట్రం నష్టం ప్రతిపాదనలనైనా తయారుచేసిందా, వాటిని కేంద్రం పట్టించుకోలేదా అనే అంశాలు చూసుకుని తర్వాత విమర్శలకు దిగితే బాగుంటుంది. సమాన సాయం అని కాకుండా, నష్టాన్ని బట్టి సాయం అడిగితే.. ఏమో హైదరాబాదు నగరానికి జరిగిన నష్టాన్ని లెక్కకడితే తెలంగాణకే ఎక్కువ దక్కవచ్చు కూడా!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*