మాయ బలోపేతం అవుతున్నారా?

గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలవలేక పోయినప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ని ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే అంతకన్నా పెద్ద పొరపాటు ఉండదు. పార్టీ అధినేత్రి మాయావతి ప్రస్తుతానికి దెబ్బతిన్న పులిలా ఉన్నారు. ఏ రోజైనా జాతీయ ప్రత్యర్థులపై పులిలా పంజా విసరడానికి సిద్థంగా ఉన్నారు. తన శక్తియుక్తులను కూడదీసుకుని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమె అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రస్తుతానికి రాజకీయ ముఖచిత్రంపై పెద్దగా కనిపించనప్పటికీ తెరవెనుక సుదీర్ఘమైన కసరత్తు చేస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కోల్పోయిన బలాన్ని కూడగట్టుకునేందుకు అరవై ఏళ్ల మాయావతి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా…..

నాలుగుసార్లు దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి రికార్డు సృష్టించారు. మొదటి మూడు సార్లు కొద్దిరోజులే పనిచేసినప్పటికీ నాలుగోసారి సంపూర్ణ ఆధిక్యంతో ఐదేళ్లు అధికారంలో కొనసాగడం విశేషం. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ప్రోత్సాహంతో రాజకీయరంగంలోకి ప్రవేశించిన మాయావతి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. అంబేద్కర్ భావజాలాన్ని బలంగా విశ్వసించారు. అదే మార్గంలో ప్రయాణించారు. తొలిసారి 1995 జూన్ 3న యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా దేశంలో దళిత ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అదే ఏడాది అక్టోబర్ 18 వరకూ పదవిలో కొనసాగారు. ఐదు నెలలే అధికారంలో కొనసాగినప్పటికీ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ నగర్, ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లాలను ఏర్పాటు చేశారు. సంకీర్ణ రాజకీయాల కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. 1997 మార్చి 21న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఏడాది సెప్టంబరు 20వరకూ పదవిలో కొనసాగారు. అధికారంలో ఉన్నది ఏడు నెలలే అయినప్పటికీ తనదైన నిర్ణయాలు తీసుకుని సంచలనం సృష్టించారు. ఘజియాబాద్ జిల్లాను విభజించి గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాను ఏర్పాటు చేశారు. అలహాబాద్ జిల్లాను విభజించి కౌశాంబి జిల్లాను ఏర్పాటు చేశారు. మొరాదాబాద్ జిల్లాను విభజించి జ్యోతినగర్ పూలే జిల్లాను ఏర్పాటు చేశారు. దళిత, వెనకబడిన వర్గాల నాయకుల పేర్లతోనే వీటిని ఏర్పాటు చేయడం విశేషం. 1997 మే అలీఘడ్ జిల్లాను విభజించి మహామాయ నగర్ జిల్లాను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. బంద జిల్లాను విభజించి ఛత్రపతి సాహో మహారాజ్ నగర్ జిల్లాను ఏర్పాటు చేశారు. 2002 మే 3న మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడం విశేషం. ఈ దఫా ఏడాదికి పైగా అంటే 2003 ఆగస్టు 26 వరకూ పదవిలో కొనసాగారు. తన పదవీకాలంలో ఛత్రపతి సాహోజీ వైద్య విశ్వవిద్యాలయం, 511 ఎకరాల్లో గౌతమిబుద్ధ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 2003 ఆగస్టు వరకూ పదవిలో కొనసాగారు.

మార్పు వచ్చింది అప్పుడే…..

ఈ దశలోనే మాయావతిలో మార్పు కనపడింది. మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్కసారి కూడా ఎందుకు పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయానన్న ఆలోచన మొదలయింది. అప్పటి వరకూ తాను అనుసరించిన బ్రాహ్మణ వ్యతిరేక, అగ్రవర్ణ వ్యతిరేక విధానం మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. కేవలం ఏ ఒక్క సామాజిక వర్గం అండదండలతో ఎల్లకాలం పరిపాలన చేయలేనన్న వాస్తవాన్ని గ్రహించారు. దీంతో తన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు. బ్రాహ్మణులు, యాదవులు, వైశ్యులు, ముస్లింలు ఇతర అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యారు. తమ పార్టీ చిహ్నమైన ఏనుగు హిందువులు ఆరాధించే బ్రహ్మ, విష్ణుమహేశ్వరులకు ప్రతిరూపమని పేర్కొన్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాలకూ టిక్కెట్లు ఇచ్చారు. సంపూర్ణ ఆధిక్యంతో సీఎం పదవిని చేపట్టారు. పూర్తి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చేతిలో ఓడిపోయారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు.

జాతీయ రాజకీయాల్లో……

ఢిల్లీ రాజకీయాల్లోనూ మాయావతి చక్రం తిప్పారు. 1999లో జరిగిన 13వ లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలను సాధించారు. 2004లో లోక్ సభ ఎన్నికల్లో తన బలాన్ని 19కి పెంచుకున్నారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో 20 స్థానాలను కైవసం చేసుకున్నారు. 2014 లోక్ సభ ఎన్నికలు పార్టీని పూర్తిగా నిరాశపర్చాయి. కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేక పోయింది. కానీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం విశేషం. నాటి ఎన్నికల్లో ఎక్కువ ఓట్ల శాతాన్ని సాధించిన మరో అతిపెద్ద పార్టీ బీఎస్పీనే కావడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ ల తర్వాత అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది బీఎస్పీనే. ఎన్నో ప్రాంతీయ పార్టీలు కేవలం రెండు, మూడు ఓట్ల శాతాలతో పది నుంచి పదిహేను స్థానాలను గెలుచుకోవడం గమనించదగ్గ విషయం. ఆ లెక్కన చూస్తే పార్టీ అవకాశాలు బాగా ఉన్నట్లే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు ఆధారంగా అత్యధిక ఓట్లను గెలుచుకుని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. 2009 లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా 27.42 శాతం ఓట్లను పొందింది. పార్టీ చరిత్రలో ఇది రికార్డుగా పేర్కొన వచ్చు. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే యూపీ రాజకీయాలను తిరగరాసే అవకాశముంది. ఇటీవల జరిగిన కైరానా, పూల్పూర్ లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఈమూడు కలసి నిలబెట్టిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.

ఇద్దరిలో ఎవరిని….?

లోక్ సభ ఎన్నికల్లో కూడా కలసి పోటీ చేసినట్లయితే బీఎస్పీ లబ్దిపొందే అవకాశాలున్నాయి. కానీ ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ప్రశ్న. రాష్ట్ర రాజకీయాల్లో ఎస్పీ, బీఎస్పీ ఉప్పు..నిప్పు. రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థిితి. దశాబ్దాల క్రితం నాటి వైరాలను రెండు పార్టీలూ మరచిపోలేదు. రాష్ట్ర రాజకీయాల్లో రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు. కేవలం బీజేపీపై వ్యతిరేకతే వీరి స్నేహానికి ప్రాతిపదిక. అయితే అది ఎంతకాలం ఉంటుందన్నదే ప్రశ్న. ఎస్పీని పక్కన పెడితే కాంగ్రెస్ తో కలసి పనిచేయడానికి పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు లేదు. కాంగ్రెస్ వల్ల తనకు ఒరిగేదేమీ లేదని, తనవల్లే కాంగ్రెస్ లబ్దిపొందగలదన్నది మాయావతి భావన. ఇక వ్యక్తిగతంగా రాహుల్, అఖిలేష్ యాదవ్ మధ్య స్నేహబంధం ఉంది. మాయావతి, అఖలేష్ లలో ఎవరిని ఎంచుకోవాలో అర్థంకాక కాంగ్రెస్ సతమతమవుతోంది. అఖిలేష్ తో పొత్తు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రయోజనం ఉంది. అదే సమయంలో మాయావతితో పొత్తు వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మేలు కలుగుతుంది. దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు లభిస్తుందన్నది ఆ పార్టీ భావన. ప్రస్తుతానికి ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకోవాలన్న దానిపై స్పష్టత లేదు. దళిత నేతగా, మహిళగా పరిస్థితులు కలసి వస్తే మాయావతి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేం. దేవెగౌడ, గుజ్రాల్ వంటి వారు ప్రధానులయినప్పుడు మాయావతికి ఏం తక్కువన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*