చంద్రుల దెబ్బకు…విలాపమేనా?

ఇద్దరి చంద్రుల వ్యూహాలు తాజాగా వామపక్షాల వైపు మళ్లాయి. ఇంతవరకూ బీజేపీ, కాంగ్రెసులను తమకు అనుకూలంగా వినియోగించుకునే క్రమంలో ఎత్తుపైఎత్తుల చదరంగం నడిపారు. ఇప్పుడు వామపక్షాలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా బరిలోకి లాగుతున్నారు. వారిని అడ్డుపెట్టుకుని ప్రధానపక్షాలతో ఫైటింగుకు సిద్దమవుతున్నారు. పొత్తులకు, ఎదుటి పక్షాలను చిత్తు చేసేందుకు ఇప్పుడు కామ్రేడ్లు అవసరమవుతున్నారు. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. శాశ్వతమిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరంటారు. శత్రువులు మిత్రులకు మధ్య తేడా కనిపించని రాజకీయబంధం పెనవేసుకుంటున్నారు. ఎన్నికల లబ్ధి ప్రధానలక్ష్యంగా చంద్రజాలం ప్రయోగిస్తున్నారు. అన్ని జాతీయ పార్టీలను తమ చుట్టూ తిప్పుకోవడం లేదా తాము చెప్పినట్లు వినేలా చేసుకోవడంలోవీరిద్దరి వ్యూహాలు పక్కాగా ఫలిస్తున్నాయి.

కాంగ్రెసు వయా కమ్యూనిస్టులు ….

తెలంగాణలో పార్టీ బతికిబట్టకట్టాలంటే కాంగ్రెసుతో జత కట్టడం తప్పనిసరి. ఇదే విషయాన్ని తాను చెప్పకుండా పార్టీ నాయకుల నోటివెంటనే పలికించారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ ఉండటం చారిత్రక అవసరమని తేల్చేశారు. దీనికోసం ఏమేం చేయాలో సూచించండన్నారు. గతంలో అధికార తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తుపెట్టుకోవాలని టీటీడీపీ నేతలు పలుసందర్బాల్లో సూచించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ చేరువ అయ్యాయి. అందువల్ల సింగిల్ చాయిస్ కాంగ్రెసు మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారణం కాంగ్రెసు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి అధికారాన్ని చేజిక్కించుకుంది తెలుగుదేశం. ఇప్పుడు ఆ పార్టీని ఎకాఎకిన కౌగిలించుకోవడం అంత సునాయాసం కాదు. పార్టీ చరిత్రలో కాంగ్రెసుకు చేరువ అయ్యి చేతులు కలిపిన ఘట్టం ఒక్కటి కూడా లేదు. అందువల్లనే పార్టీని ముందుగా సన్నద్దం చేయాలి. ఇప్పటికే కాంగ్రెసుతో చేతులు కలిపితే ఆత్మహత్యా సదృశమంటూ ఆంధ్రాలో సీనియర్ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అది పార్టీలో ఉన్న అభిప్రాయానికి ప్రతీక. దీనికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులను బాటలు పరిచే చోదకులుగా వాడుకోవాలని ఎత్తులు వేస్తున్నారు తెలుగుదేశాధినేత.

మధ్యేమార్గం….

కాంగ్రెసు పార్టీతో చేతులు కలిపే విషయంలో మధ్యేమార్గాన్ని అనుసరించేందుకు ప్లాన్ ఖరారు చేశారు. సీపీఐ , తెలంగాణ జనసమితి వంటి పార్టీలతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుంటారు.సూత్రప్రాయంగా వీరు కలిసి పోటీ చేయనున్న విషయాన్ని ప్రకటిస్తారు. తెలంగాణకు మద్దతిచ్చిన జాతీయ వామపక్షంగా సీపీఐ కు గుర్తింపు ఉంది. తెలంగాణ కోసం పోరాడిన రాజకీయ ఐక్యకార్యాచరణ సమితికి అధ్యక్షునిగా కోదండరామ్ కు మంచి పేరు ఉంది. వీరితో కలవడం ద్వారా ఒక సానుకూల వాతావరణాన్ని తెలుగుదేశం సృష్టించుకుంటుంది. తర్వాత సీపీఐ, తెలంగాణ జనసమితితో కలిసి కాంగ్రెసుతో సంప్రతింపులు జరుపుతుంది. ఇందులో కోదండరామ్, సీపీఐలే క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఇది ఒక కూటమి ఒప్పందంగానే ప్రొజెక్టు అయ్యేలా చూసుకుంటారు. అందువల్ల టీడీపీ, కాంగ్రెసుల పొత్తు అన్న ముద్ర నేరుగా పడదు. పైపెచ్చు ముందుగానే చిన్న కూటమి యత్నాల వల్ల కాంగ్రెసుతో బేరసారాల్లో ఎక్కువ సీట్లు సాధించవచ్చని టీడీపీ భావిస్తోంది. కోదండరామ్ ముందుకు వచ్చినా రాకపోయినా సీపీఐ ఇందుకు సిద్దంగానే ఉంది.

సాకులే..సాక్ష్యాలుగా…

కేసీఆర్ కు సీపీఎం భలే దొరికింది. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుగా తాను కాంగ్రెసుతో జట్టుకట్టనంటూ మహాకూటమి యత్నాలకు సీపీఎం గండి కొడుతోంది. టీఆర్ఎస్ కు లాభించేలా బహుజనలెఫ్ట్ ఫ్రంట్ కూటమి కట్టింది. జనసేన కూడా జోడీ కట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే దాదాపు నలభై నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల ఓట్ల మధ్య చీలిక వస్తుంది. అదే మహాకూటమిలో సీపీఎం కూడా కలిసి నడిస్తే 20 సీట్లలో గెలుపోటములను శాసించే స్థాయి ప్రతిపక్షాలకు సమకూరేది. ఆమేరకు 20 నియోజకవర్గాలలో గెలుపును కారుకు కానుకగా ఇస్తున్నట్లే. టార్గెట్ కమలం సాకుతో వయా వామపక్షాల మీదుగా కాంగ్రెసుకు సైకిల్ అండ దొరకబోతోంది. కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు రెంటికీ సమదూరం అంటూ సీపీఎం అదికారపార్టీ విజయానికి భరోసానిస్తోంది. మొత్తమ్మీద ప్రాంతీయ పార్టీల అధినేతలైన కేసీఆర్, చంద్రబాబులు ఇద్దరూ జాతీయ పార్టీలకు ప్రతిగా ఏదో ఒక వామపక్షాన్ని పావుగా వాడుకోవడం విశేషం.

 

-ఎడిటోరియల్ డెస్క్