చారిత్రాత్మక విజయం

ఎడిటోరియల్ టీం

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ప్రజలు గత వారం చాలా స్పష్టమైన తీర్పునిచ్చారు.

మొత్తం సీట్లు 150 కాగా, అధికార పార్టీ టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం 44 సీట్లు నెగ్గి గత ప్రదర్శననే కొనసాగించింది. బిజెపి + టిడిపి 5 సీట్లలో నెగ్గగా
మునుపటి ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా నిల్చిన కాంగ్రెస్ కేవలం 2 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్, నగరం యొక్క పౌర సదుపాయాలు మెరుగుపరచడం, ప్రపంచ స్తాయి గొప్ప నగరాలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి హామీలు ఇవ్వగా, ప్రజలు అతి పెద్ద మెజారిటీ తో గెలిపించడం ద్వారా ఇచ్చిన హామీలకు పూర్తి భాద్యత టిఆర్ఎస్ స్వీకరించాలని తెలియచేసినట్లయింది. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వం కోసం చాలా సమస్యలు ఎదురు చూస్తున్నాయి. చెత్త సేకరణ, పాడుబడిపోయిన డ్రైనేజి వ్యవస్థ, ట్రాఫిక్ సమస్యలు, త్రాగు నీటి సరఫరా, 24 గంటల నిరంతర కరెంటు సరఫరా, మరియు మురికి వాడల్లో నివసించే ప్రజల పునరావాసం మొదలైన సమస్యల పైన దృష్టి సారించాల్సి వుంది. ఈ సమస్యలు అన్నీ పరిష్కరించకుండా హైదరాబాదుని ప్రపంచ నగరంగా చేయడం అసాధ్యమని కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వం గ్రహించాల్సి వుంది.

నిర్ణీత సమయంలో కొత్త నిర్మాణాలకు అనుమతులు మంజూరు / ధ్రువీకరణ చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలు అరికట్టాల్సి వుంది. ఐటి మంత్రి KTR మీడియా ముందు ప్రసంగిస్తూ, ప్రస్తుతం అమలులో వున్న LRS / BRS (లేఅవుట్ మరియు బిల్డింగ్ క్రమబద్ధీకరణ) పథకమే చివరిదని ఇక ముందు ఇలాంటి పథకాలు ఉండవని స్పస్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం అక్రమ లేఅవుట్ మరియు నిర్మాణాలు అరికట్టేందుకు స్వాగత చిహ్నం అనుకోవచ్చు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈ విజయం హైదరాబాదీలు అందరిదనీ, ఏ ప్రాంతానికో, మతానికో లేక కులానికో పరిమితం కాదని స్పష్టం చేశారు. అంతే కాకుండా తెలంగాణ పోరాటంలో భాగంగా పలువురు నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రజలందరూ విస్మరించాలని కోరారు. ఈ ఎన్నికలలో విజయం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల మద్దతూ టిఆర్ఎస్ పొందినట్లయింది. ఇప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బాధ్యత.

ఈ చారిత్రాత్మక విజయం యొక్క పూర్తి క్రెడిట్ మంత్రి KTR కి దక్కుతుంది. మొత్తం ఎన్నికల ప్రచారాన్ని KTR ముందుండి నడిపించారు. ఈ విజయం తర్వాత మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖని ముఖ్యమంత్రి KTR కి అప్పగించారు. ఈ నిర్ణయం వలన జిహెచ్ఎంసిలో మరింత నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం KTR కి దక్కుతుంది. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు తీర్చే మరియు ఒక నిజమైన ప్రపంచ నగరంగా తయారు చేయడానికి KTR అందరికంటే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి.

టీఆర్ఎస్ కి ఒక చారిత్రాత్మక విజయం చేకూర్చడం ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన సవాలుని, వాగ్దానాలు ఆచరణలో పెట్టడం ద్వారా ప్రభుత్వం స్వీకరించవలసి వుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*