తెలుగోడికి మోడీ మొండిచేయి

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగింది. ఇటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ కు  కేటాయింపుల్లో వివక్ష చూపారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తెలంగాణలో ఎయిమ్స్ కు నిధులు కేటాయిస్తారని భావించారు. ప్రధాని మోడీని కూడా కలసి టీఆర్ఎస్ ఎంపీలు ఎయిమ్స్ కు నిధులు కేటాయించాలని కోరారు. కాని తీరా బడ్జెట్ చూస్తే నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎయిమ్స్ ను తెలంగాణకు ఇవ్వకుండా గుజరాత్ కు తీసుకెళ్లారని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఈ ఏడాది కూడా రూ.101 కోట్ల రూపాయలనే కేటాయించింది. గత ఏడాది  కూడా ఇంతే మొత్తాన్ని కేంద్రం ఇచ్చింది. విజయవాడ మెట్రోకు ఏడు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. అయితే మెట్రో రైలు ప్రాజెక్టుకు పూర్తి స్తాయిలో నిధులు మంజూరు చేయాలంటే 20 లక్షల మంది జనాభా అవసరం. అయితే విజయవాడ మెట్రోకు ఆ అర్హత లేదంటోంది కేంద్రం. కాని విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టు కాబట్టి పూర్తి స్థాయి నిధుల మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కాని ఈ ఏడాది కూడా అత్తెసరు నిధులను మాత్రమే కేటాయించడంతో బెజవాడ మెట్రో వ్యయ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. మెట్రో రైలు వ్యయంలో ఇతర ప్రాంతాల మాదిరిగానే కేంద్రం 20 శాతం నిధులను మాత్రమే ఇస్తుంది. పూర్తి స్థాయి నిధులు కేంద్రం నుంచి  రావాలంటే కష్టమేనని చెబుతున్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ నిరాశనే మిగిల్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*