పార్లమెంటును తాకిన ఏపీ సెగ

పార్లమెంటును ఏపీ ఎంపీలు స్థంభింప చేశారు. పార్లమెంటు సాక్షిగా అమలు చేయాలని కోరుతూ లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు ఆందోళనకు దిగారు. నిరసనలతో హోరెత్తించారు. అలాగే వైసీపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వారు నినాదాలు చేశారు. నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా అమలుచేయడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంట్, పోలవరం పనులను వెంటనే పూర్తి చేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ ఎంపీల నిరసన…..

ఇక టీడీపీ ఎంపీలు సయితం పార్లమెంటు సమావేశానికి ముందు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ ఎంపీలు చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీని అవమానపర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఎంపీ శివప్రసాద్ విన్నూత్నంగా నారద వేషం వేసి ఆకట్టుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకూ ఆందోళన చేస్తామని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.