రాములమ్మపై వీరు రుసరుసలు…!

విజయశాంతికి పెద్దపీట వేయడంపై కాంగ్రెస్ నేతల్లో అసహనం బయలుదేరింది. క్షేత్రస్థాయిలో పార్టీని మూడున్నరేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ఊపు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమేంటని పలువురు సీరియస్ గానే హైకమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం విజయశాంతి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన సంగతి తెలిసిందే. ఆమెకు పార్టీలో రెండు పదవులు ఇవ్వనునన్నారని సమచారం. పార్టీ ప్రచార కమిటీలో విజయశాంతికి కీలక బాధ్యతలను అప్పగించనున్నట్లు ఇక్కడి నేతలకు ఉప్పందంది. దీంతో రాములమ్మకు అంత ప్రయారిటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అంత ప్రయారిటీ ఎందుకో…?

విజయశాంతి తొలుత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి, ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లి ఎంపీ అయ్యారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి 2014 ఎన్నికలకు ముందు సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన తర్వాత విజయశాంతి అస్సలు కన్పించలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. గాంధీభవన్ ముఖంచూడలేదు. అంతెందుకు రాహుల్ పర్యటనను కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. కాని రేవంత్ చేరిక తర్వాత కాంగ్రెస్ ఊపు మీదుండటంతో మళ్లీ విజయశాంతి తెరమీదకు వచ్చారు. దీన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. మూడున్నరేళ్లు తాము నానాకష్టాలు పడి, అరెస్ట్ లయి రోడ్డు మీద తిరుగుతుంటే… ఏసీ గదుల్లో ఇప్పటి వరకూ ఉండి తగుదునమ్మా… అంటూ ఎన్నికలకు ముందు వస్తే పార్టీ అధిష్టానం ఎలా ప్రయారిటీ ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ వద్దకు విజయశాంతిని తీసుకెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా నిలదీశారు కొందరు. కాని ఉత్తమ్ మాత్రం విజయశాంతి వల్ల ఉపయోగం ఏమీ లేదని తనకు తెలుసునని, కాని సినీ గ్లామర్ ఉండాలనే ఆమెకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. మొత్తం మీద రాములమ్మ రీఎంట్రీ అనేక మంది కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*