విజయ్ కథ…అలా మొదలై…ఇలా ముగిసింది…!

ఒక మరణం… వంద ప్రశ్నలు… ఎన్నో సందేహాలు… మరెన్నో అనుమానాలు… ఇన్ని అనుమానాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో విజయ్‌సాయి సూసైడ్‌ కేసు ట్విస్టుల మీద ట్విస్టులను తలపిస్తోంది. గతంలో వనితతో విజయ్‌సాయి, అతని తండ్రి సుబ్బారావు మాట్లాడిన ఫోన్‌కాల్స్‌ ఆడియోలు కూడా బయటకొచ్చాయి. ఇన్ని మలుపులు తిరుగుతున్న కేసును పోలీసులు ఎలా డీల్‌ చేస్తారు?

అనేక మలుపులు….

విజయ్‌సాయి సూసైడ్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు విజయ్‌, వనితల కథ ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైందని చూస్తే… వాల్‌ పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో వీరిద్దరికీ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే వనితకు 13 ఏళ్ల క్రితమే పెళ్లైందని, బాల్యవివాహం కావడంతో నెల రోజులు కూడా కాపురం చేయకుండా విడాకులు తీసుకుందని చెబుతున్నాడు వనిత సోదరుడు. మొదటి భర్తను వదిలి వచ్చి హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్టుగా స్థిరపడిందని, అప్పుడు విజయ్‌తో రెండేళ్ల ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లిందంటున్నాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని, యాదగిరిగుట్టకు వెళ్లి పెళ్లి చేసుకున్నారని చెబుతున్నాడు వనిత సోదరుడు. పెళ్లి తర్వాత రెండు కుటుంబాలు దగ్గరయ్యాయని, అయితే విజయ్‌ తన సోదరిని వేధించాడని చెబుతున్నాడు. విజయ్ మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియోలను వనిత చూడటంతో గొడవలు ముదిరాయని అంటున్నాడు.

వనిత అసలు పేరు….

వనితకు సంబంధించిన కొత్త విషయాలు బయటపడ్తున్నాయి. ఆమె అసలు పేరు వనిత కాదని, వరలక్ష్మీ అని గుర్తించారు పోలీసులు. అలాగే పాస్‌పోర్ట్‌లో ఒక పేరు… స్కూల్ సర్టిఫికెట్‌లో మరో పేరు ఉందని గుర్తించారు. అంతేగాక వనిత స్కూల్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టులో తండ్రి పేర్లు వేర్వేరుగా ఉన్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వనిత తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేసిందని, దీంతో రఫీకి విజయ్‌సాయి ఆత్మహత్యతో ఏమైనా సంబంధముందా? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఇక విజయ్ గతంలో భార్య వనితతో మాట్లాడిన ఫోన్‌ ఆడియోకూడా బయట పడింది. అందులో విజయ్‌ నువ్వు తప్పుచేయవని… నాకు తెలుసని అంటే … మరి తెలిసి ఎందుకు నన్ను అనుమానిస్తున్నావని ప్రశ్నించింది వనిత.

భార్య వేధింపుల వల్లనే….

విజయ్‌ ఆత్మహత్యకు భార్య వనిత వేధింపులే కారణమని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే… తనకేమీ సంబంధం లేదని, తననే వేధించేవాడని, ఆస్తి తగాదాల వల్ల సూసైడ్‌ చేసుకొని ఉంటాడంటోంది వనిత. వీళ్ల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా ఉంటే కారు గొడవ, పాస్‌పోర్టులో వేర్వేరు పేర్ల అంశం తెరపైకి వచ్చాయి. ఇది కాక రహస్య వీడియోల పేరుతో తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని విజయ్‌ ఆరోపించాడు. మరి ఈ వీడియోలు నిజంగానే ఉన్నాయా? ఉంటే ఆ వీడియోలో ఏమున్నాయి? ఎందుకు విజయ్‌సాయి భయపడ్డాడు? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇన్ని ట్విస్టులుండటంతో ఈ ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సెల్ఫీ వీడియో ఆధారంగా వనిత, శశిధర్‌, శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. వనితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశిధర్‌, శ్రీనివాస్‌లను విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది. అసలు విజయ్‌ ఆత్మహత్యకు కారణం ఎవరు? ఎందుకు సూసైడ్‌ చేసుకోవాల్సి వచ్చింది? అతని తండ్రి ఆరోపణల్లో నిజమెంత? వనిత చెబుతున్న మాటల్లో వాస్తవమేంటీ? రేకెత్తిన అనుమానాలకు పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి. ఏదేమైనా విజయ్‌ సాయి బలవన్మరణం టాలీవుడ్‌ను విషాదంలో నింపింది. సినీ పరిశ్రమలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి… పెళ్లి తర్వాత గొడవలతో చివరికిలా విషాదాంతమవడం టాలీవుడ్‌కు షాకిచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*