గ్రీన్ కార్డు బతికున్నంత వరకూ రాదా?

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు తప్పక చదవాల్సిన వార్త ఇది. అడ్వాన్స్డ్ డిగ్రీలు పట్టుకుని ఎలాగైనా గ్రీన్ కార్డు దక్కించుకుని అమెరికాలో సెటిల్ కావాలనుకుంటే 151 ఏళ్లు ఆగాలంటోంది ఓ రిపోర్టు. అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య, గతేడాది మంజూరైన గ్రీన్ కార్డుల సంఖ్యను బట్టి చూస్తే ఇప్పుటికే దరఖాస్తు చేసుకున్న వారికి గ్రీన్ కార్డులు రావడానికే ఇన్నేళ్లు పడుతుందని అంచనా వేసింది. అంటే, ఇప్పటి నుంచి దరఖాస్తు చేసుకునే వారికి ఇంకా ఎక్కువే పడుతుంది అన్న మాట. గతేడాది మంజూరైన అమెరికా పౌరసత్వాల సంఖ్యలను బట్టి వాషింగ్టన్ కి చెందిన కాటో ఇన్ స్టిట్యూట్ అనే సంస్థ దరఖాస్తు చేసుకున్న వారికి గ్రీన్ కార్డులు రావాలంటే ఎన్నేళ్లు పడుతుందనే అంచనాతో కూడిన రిపోర్టును విడుదల చేసింది.

భారీగా వెయిటింగ్ లిస్టు….

అమెరికా పౌరసత్వానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే లెక్కలను యూఎస్ సిటిజన్ షిప్ ఆండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) ఇటీవల విడుదల చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 20 నాటికి మొత్తం భార్యభర్తలు, మైనర్ పిల్లలు కలిపి మొత్తం 6,32,219 మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక గ్రీన్ కార్డుల మంజూరు నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో గతేడాది కేవలం 22,602 మందికి మాత్రమే గ్రీన్ కార్డులు మంజూరయ్యాయి. ఇందులో ఈబీ-1 క్యాటగిరి కింద 13,082 మందికి, ఈబీ-2 కింద 2,879 మందికి, ఈబీ-3 కింద 6,641 మందికి అమెరికా పౌరసత్వం లభించింది.

– అడ్వాన్స్డ్ డిగ్రీ ఉండి ఈబీ-2(ఎంప్లాయ్ మెంట్ బేస్డ్) కింద గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసిన భారతీయుల సంఖ్య భారీగా ఉంది. ఈ క్యాటగిరీ కింద 2,16,684 మంది దరఖాస్తు చేసుకోగా వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు కలిపి మొత్తం సంఖ్య 4,33,368 గా ఉంది. అంటే ఇప్పడున్న నిబంధనలే ఉండి, ఇదే సంఖ్యలో గ్రీన్ కార్డులు మంజూరు చేస్తే వీరందరికీ అమెరికా పౌరసత్వం దక్కాలంటే కచ్చితంగా 151 ఏళ్లు పడుతుందని కాటో సంస్థ అంచనా వేసింది.

– ఇక బ్యాచిలర్ డిగ్రీలు ఉండి ఈబీ-3 కింద దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1,15,273గా ఉంది. వీరందరికీ గ్రీన్ కార్డులు రావాలంటే 17 ఏళ్లు పడుతుంది అని అంచనా.

– ఈబీ-1 క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం కేవలం 6 సంవత్సరాల్లోనే గ్రీన్ కార్డులు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. అత్యున్నత నైపుణ్యాలు ఉన్నవారు ఈబీ-1 క్యాటగిరి కింద దరఖాస్తు చేసుకుంటారు. ఈబీ-1 కింద దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 83,578 మాత్రమే. దీంతో వీరికి ఆరేళ్లలోనే గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.

కారణాలివే…

భారతీయులకు గ్రీన్ కార్డులు మంజూరు ఆలస్యమడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ప్రతీ క్యాటగిరీలో 40,040 గ్రీన్ కార్డులే మంజూరు చేయాలనే నిబంధన ఉంది. దీంతో ఈబీ-2, ఈబీ-3 క్యాటగిరీల్లో అధికంగా డిమాండ్ ఉండటంతో వెయిటింగ్ లిస్ట్ పెరుగుతూ పోతోంది. ఇక రెండోది, భారీగా డిమాండ్ ఉన్న ఈబీ-2 క్యాటగిరీ కింద గ్రీన్ కార్డుల మంజూరుకు వివిధ దేశాలకు కొంత లిమిట్ పెట్టారు. దీని ప్రకారం ఈ క్యాటగిరీ మొత్తంలో ఏడు శాతం మాత్రమే భారతీయులకు అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఉన్న నిబందనలు మారితే లేదా ఇక నుంచి దరఖాస్తుల సంఖ్య తగ్గితే మాత్రమే అంచనా కంటే ముందే గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*