బంధుప్రీతి..జిందాబాద్

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. కొన్నేళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా కొనసాగారు. ఇప్పుడు సచిన్ ఆట చూసే అవకాశం లేకున్నా, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ తన తండ్రి స్ఫూర్తితో క్రికెట్ గ్రౌండ్ లో దూకనున్నారు. 18 ఏళ్ల అర్జున్ వచ్చే నెల శ్రీలంకలో జరుగనున్న రెండు మ్యాచ్ లు ఆడే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. అర్జున్ అండర్-19 జట్టులో స్థానం సంపాదించడం పట్ల కొందరు క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ బాగా ఆడి తండ్రికి తగ్గవాడిగా పేరు సాధించాలని ఆశిస్తున్నారు.

సోషల్ మీడియాలో విమర్శలు….

ఇదే సందర్భంలో అండర్-19 జట్టులోకి అర్జున్ ఎంపికపై పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. అర్జున్ ఎంపిక వెనక బంధుప్రీతి, తండ్రి పలుకుబడి ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ ఒక యావరేజ్ బౌలర్, తండ్రి రికమెండేషన్ ద్వారా ఇప్పుడు అండర్-19 జట్టులో భాగమయ్యారు. వందలాది మంది ప్రతిభ కలిగిన బౌలర్లు నిర్లక్ష్యానికి గురయ్యారు.’ అని ఓ క్రికెట్ అభిమాని ట్వీట్ చేశాడు. ‘అర్జున్ టెండుల్కర్ ను జీన్స్ ఆధారంగా ఎంపిక చేసినట్లున్నారు. ఒకవేళ అతడు బాగా ఆడితే, ప్రాచీన భారతంలోనే జెనెటిక్స్ పైన పరిశోధనలు జరిగాయి అంటారు’ అని మరో వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘అర్జున్ తన తండ్రి పరిచయాలతో జట్టులోకి వచ్చి ఉంటాడు. కానీ, అతను బాగా ఆడితేనే భారత జట్టులో ఉంటాడు. లేదా కొందరు ప్రముఖ క్రికెటర్ల కుమారుల లాగానే కెరీర్ ఉండదు’ అని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. ఇలా అనేక మంది అర్జున్ ఎంపిక వెనుక బంధుప్రీతి ఉందని ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*