దయచేసి నన్ను సస్పెండ్ చేయండి..

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీపై మొదటిసారిగా నోరు విప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ పెద్దలు మాత్రం డీఎస్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. కేసీఆర్ డీఎస్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న డీ.శ్రీనివాస్ ఇక టీఆర్ఎస్ తో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనంతట తాను పార్టీ వీడనని, అలా వీడితే తనపై ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లే అవుతుందని పేర్కొన్నారు. అందుకే దయచేసి పార్టీని నుంచి తనను సస్పెండ్ చేయాలని కోరారు. ఒకవేళ అది చేత కాకపోతే, తనపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజకీయంగా దెబ్బతీయడానికే…

తనను నమ్ముకున్న వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని, తన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసన్నారు. స్వతంత్రంగా పెరిగిన తన కుమారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, తండ్రిగా తాను అడ్డు చెప్పలేనన్నారు. ఇది ప్రతీ ఇంట్లో జరిగేదేనని ఆయన పేర్కొన్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని కావాలనే తనపై ఆరోపణలు చేశారని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలా చేశారని ఆరోపించారు. తెలంగాణ పట్ల తన నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. తాను క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తానని, టీఆర్ఎస్ కు ఏమి నష్టం చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*