కేసీఆర్ కు ప్రతిష్టాత్మక అవార్డు….!

ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండి వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు టైమ్స్ గ్రూపు ఎండికి సిఎం ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ముఖ్యమంత్రి సమ్మతించారు.

అందరి కృషితోనే……

ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చినట్లు భావించడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి లభించిన గుర్తింపుగా స్వీకరిస్తున్నాని సిఎం ఈ సందర్భంగా టైమ్స్ గ్రూపుకు ఈ మెయిల్ ద్వారా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం గడిచిన నాలుగేళ్లుగా సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, ఈ ఏడాది మొదటి ఐదేళ్లలో 21.96 శాతం ఆదాయాభివృద్ది సాధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన టిఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం మంచి ఫలితం ఇచ్చిందని, దీని ద్వారా ఇప్పటికే 7000 పరిశ్రమలు అనుమతులు పొందాయని సిఎం చెప్పారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు, పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చాయని వివరించారు.

పెట్టుబడుల వెల్లువ……

ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా, ఎవరూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరిశ్రమల అనుమతులు వస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ది ఇలాంటి అవార్డులు రావడానికి కారణం అవుతున్నాయని వెల్లడించారు. భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించిన విషయాన్ని కూడా సిఎం ప్రస్తావించారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చిన ఐటి పరిశ్రమలు కూడా రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాయన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*