దొంగలించిన సొమ్ముతో ఏం చేస్తారో తెలుసా ?

కెర్వా గ్యాంగ్..బస్సులో ప్రయాణించే ప్రయాణికులే వీరి టార్గెట్. బస్సు ప్రయాణించే సమయంలో, బస్సు టీ కోసం ఆగగానే బ్యాగ్ లు, సూట్ కేసుల్లో నగదు, బంగారం చోరీ చేస్తారు. నెలలో మూడు నాలుగు చోట్ల వీరు చోరీ లు చేస్తారు. ఇలా సంపాదించిన డబ్బులతో స్కూల్స్ కట్టడం, బస్సులు కొని నడపడం, పెద్ద పెద్ద బిల్డింగ్ లు కొనడం చేస్తారు. ఒక్కసారి బయటకి వస్తే ఐదారు రాష్ట్రాల్లో వీరు ఇలాంటి చోరీలు చేస్తారు. వీరు 2004 నుంచే నేరవృత్తిలో ఉన్నా 2015 వరకు ఒక్క కేస్ కూడా బుక్ కాలేదంటే వారు ఎంత పకడ్భందీగా స్కెచ్ వేస్తారో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 10 రాష్ట్రాల్లో వీరు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ గ్యాంగ్ పై సైబరాబాద్ లో 6 కేసులు నమోదు అయ్యాయి. రెండునెలల పాటు శ్రమించిన సైబరాబాద్ ఎస్ఓటీ బృందం ఎట్టకేలకు వీరి గుట్టు రట్టు చేశారు.

కార్లలో బయలుదేరుతారు…

ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాహర్‌ జిల్లా కెర్వా జాగీర్ గ్రామానికి చెందినది. ఈ గ్రామంలో కేవలం 80 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఇందులో 60 శాతం మంది నేర చరిత్ర కలిగిన వాళ్లే. జాతీయ రహదారులపై ఉన్న దాబాలు, రెస్టారెంట్లు వీరి అడ్డాలు. అక్కడికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలలో అక్కడికి వచ్చే ప్యాసింజర్ల లగేజీ నుండి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళతారు. వీరి గ్రామానికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే గ్రామం లోపలికి కూడా రానీయరు. ప్రతి ఒక్కరికి విలాసవంతమైన కార్లతో పాటు గ్రామంలో మంచి ఇళ్లు కూడా ఉన్నాయి. గ్రామానికి పోలీసులు వస్తే వాళ్లపై దాడి చేయడంలో ఈ గ్రామస్తులు ఏమాత్రం ఆలోచించరు. ఒక కారులో ముగ్గురి నుండి ఐదుగురు కలిసి దొంగతనాలు చేయడానికి గ్రామం నుండి బయలు దేరుతారు. ఈ గ్యాంగ్ పై 8 రాష్ట్రాల్లో కేసులున్నాయి. ఈ గ్యాంగ్ లో మొదటి నిందితుడు హైదర్ అలీ ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. ప్రాపర్టీ అఫెన్స్ చేయడంలో హైదర్ అలీ కీలకం. పూణే పోలీసులకు 2015 నుండి హైదర్ అలీ మోస్ట్ వాంటెడ్. హైదర్ అలీ కి ఒక స్కూల్ కూడా ఉంది. ఈ గ్యాంగ్ కు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కుకట్ పల్లి బస్ స్టాప్ వద్ద నిందితులను అరెస్టు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*