టాలీవుడ్ లో మరో విషాదం

తెలుగు సినీ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ హైదరాబాద్ లో గుండెపోటుతో రాత్రి మృతి చెందారు. సినీ పరిశ్రమకు దర్శక దిగ్గజాలను పరిచయం చేశారు కె.రాఘవ. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.రాఘవ రాత్రి 9 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు.

అంచెలంచెలుగా ఎదిగి….

సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు కె.రాఘవ. 15 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయి చెన్నై చేరిన రాఘవ సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో పరిచయం చేశారు. తొలిదశలో ఆఫీస్ బాయ్ గా, లైట్ మెన్ గా, కెమెరా ట్రాలీ పుల్లర్ గా, ప్రొడక్షన్ మెన్ గా పనిచేసిన రాఘవ నిర్మాత బి.ఎ. సుబ్బారావు వద్ద అసిస్టెంట్ గా పనిచేసి ఆ తర్వాత నిర్మాతగా మారారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ లో రాఘవ నిర్మించిన తాత మనవడు సినిమాలో హాస్యనటుడు రాజబాబును హీరోగా, రాజబాబు తాతగా ఎస్వీ రంగారావు నటించారు. ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. కథే హీరోగా నమ్మి చిత్రాలు నిర్మించారు.

దిగ్గజాలను పరిచయం చేసి…..

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు, జగత్ జట్టీలు, సంసారం సాగరం, తూర్పు పడమర, చదువు సంస్కారం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి, అంతులేని వింత కథ, సూర్య చంద్రులు, తరంగిణి, ఈ ప్రశ్నకు బదులేది, యుగకర్తలు, అంకితం, నారద వినోదం చిత్రాలు నిర్మించారు. నారద వినోదంలో ఎస్వీ రంగారావుని కౌబాయ్ గా చూపారు. సీతాపతి సంసారం సినిమాని హిందీలో రిమేక్ చేశారు రాఘవ. తెలుగు, హిందే కాదు తమిళ్ లో మైనర్ మాప్లే సినిమాను నిర్మించి.. అజిత్ ను హీరోగా పరిచయం చేశారు. చిత్ర భాగస్వామిగా సుఖదు:ఖాలు సినిమాకు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అవకాశమిచ్చారు. సుఖదు:ఖాలు సినిమాలో మేడంటే మేడ కాదు అనే గేయం ఎస్పీ బాలు పాడిన తొలిసాంగ్. సూర్య చంద్రులులో ఎస్పీ బాలసుబ్రమణ్యం చెల్లెలు ఎస్పీ వసంతచే మల్లెలు పూచే చల్లని వేళ అనే సాంగ్ పాడించారీయన.

ఎన్నో పురస్కారాలు…..

ఎన్నో పురస్కారాలు, అవార్డులు ఆయన్ని వరించాయి. ఈయన నిర్మించిన 1972లో తాత మనవడు సినిమాకు నంది అవార్డు, 1973లో సంసారం సాగరం సినిమాకు నంది అవార్డు లభించింది. 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం రాఘవ ఇచ్చి సత్కరించారు. : తెలుగు తెరకు ఎందర్నో పరిచయం చేశారీయన. తాత మనవడు సినిమాకు దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయం చేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి కోడి రామకృష్ణకు డైరెక్టర్ గా అవకాశమిచ్చారు. ఇదే సినిమాలో గొల్లపూడి మారుతీరావుని, తూర్పు పడమరలో మాధవిని, జగత్ కిలాడీలు లో రావుగోపాలరావుని, తరంగిణి సినిమాలో సుమన్, భానుచందర్ తెలుగుతెరకు పరిచయం చేశారు.

కధను నమ్మి……

పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్ కు డూప్ గా నటించారు. ఇన్ని సినిమాలు చేసిన రాఘవ అస్సలు చదువుకోలేదు. కేవలం కథను నమ్మి సినిమాలు నిర్మించేవారు. తాత మనవడు సినిమా విడుదలైన తొలిరోజు విజయవాడలోని ఓ ధియేటర్ కు వెళ్లి సినిమాను చూశారు. మొదటి రోజు కలెక్షన్లు లేక వెలవెలబోయిన ఆ సినిమా ఆ తర్వాత కలెక్షన్ల వర్షం కురిపించింది. చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య హైదరాబాద్ శాంతి ధియేటర్ లో 500 రోజులు ప్రదర్శితమైంది. తరంగిణి సినిమా 365 రోజులు ప్రదర్సితమైంది. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక మొట్టమొదటి సారిగా ఇక్కడే డబ్బింగ్ ధియేటర్ తో పాటు.. ఇంటిని నిర్మించుకున్నారు. : నిర్మాత రాఘవకు కుమారుడు ప్రతాప్, కుమార్తె శాంతి ఉన్నారు. మూడు నెలల క్రితమే భార్య చనిపోయారు. దాంతో దిగులుతో అనారోగ్యం పాలయ్యారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో కె.రాఘవ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*