మోదీ సవాల్ అదిరిందిగా…

కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తో ప్రారంభమైన ఫిట్ నెస్ ఛాలెంజ్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇవాళ ప్రధాన నరేంద్ర మోదీ కూడా ఈ ఛాలెంజ్ చేసి చూపడం, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సవాల్ విసరడం రాజకీయవర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిగా మారిపోతంది. మొదట రాజ్యవర్ధన్ సవాల్ కి స్పందించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేరుగా ప్రధానికే సవాల్ విసిరారు. అప్పుడే సవాల్ స్వీకరించిన మోదీ ఇవాళ తన ఫిట్ నెస్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తాను ఉదయమే ఎక్సర్ సైజ్ చేస్తే ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో ప్రేరణ పొందుతానని ఆయన తెలిపారు. రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించిన ఎక్సర్ సైజ్ లు చేస్తానని పేర్కొన్నారు.

కుమారస్వామికే ఎందుకు…?

ఇక ఇక్కడ మోదీ తనదైన శైలితో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. విరాట్ సవాల్ ను స్వీకరించి ఫిట్ నెస్ వీడియో పోస్ట్ చేసిన మోదీ…ఈ సవాల్ ను కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి విసిరారు. ఆయనతో పాటు కామెన్వెల్త్ విజేత మానిక బాత్రా, 40 ఏళ్ల పైబడిన ఐపీఎస్ అధికారులను ఛాలెంజ్ కు ఆహ్వానించారు. కాగా, కర్ణాటక ఎన్నికల అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కుమారస్వామి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన బీజేపీతో ఒకరకంగా భారీ యుద్ధమే చేశారు. అయినా కూడా మోదీ కుమారస్వామికి ఫిట్ నెస్ సవాల్ విసరడం గమనార్హం. ఇక ఛాలెంజ్ ఆహ్వానించినప్పుడే ట్విట్లతో మోదీపై విరుచుకుపడ్డ రాహుల్, తేజస్వీ వంటివారు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

స్పందించిన కుమారస్వామి…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఫిట్ నెస్ సవాల్ విసరడంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా స్పందించారు. ప్రధాన సవాల్ విసరడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్ లో బదులిచ్చారు. తన ఆరోగ్యంపై మోదీ శ్రద్ధ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిజికల్ ఫిట్ నెస్ అందరికీ ముఖ్యమైనని, తాను రోజూ యోగా, ట్రెడ్ మిల్ చేస్తానని కుమారస్వామి జవాబిచ్చారు. అయితే, తాను రాష్ట్రాన్ని బలోపేతం చేయడం కోసం ఆందోళన చెందుతున్నానని, ఇందుకోసం మీ సహకారం కావాలని ఆయన ప్రధానిని కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*