ఎన్టీయే కోట‌కు బీట‌లు… రేగిన మ‌రో సెగ‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉండ‌గానే.. సీట్ల పంపకంపై జేడీయూ నేత‌, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ ఎన్డీయేలో సెగ‌లు రేపుతున్నారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎన్నిసీట్లు కావాలో ముందే సూటిగా చెప్ప‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది ఇప్పుడు మిగ‌తా ప‌క్షాల మెద‌ళ్ల‌ను తొలుస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా మోడీకి వ్య‌తిరేకంగా బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్న‌వేళ‌.. నితీశ్ కూడా ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ వినిపిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొద్దిరోజులుగా మోడీపై ప‌రోక్షంగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్పుడే సీట్ల పంపిణీపై ప్రకటనలు…

చాలా రోజులుగా మ‌రుగున ప‌డిన బీహార్‌కు ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని మ‌ళ్లీ ముందుకు తెచ్చారు. తాజాగా.. జేడీయూ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఎన్డీయే ప‌క్షాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. బీహార్‌లో మొత్తం 40 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని, బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని జేడీయూ సూటిగా చేప్పేసింది. అయితే ఉన్న 40 స్థానాల్లో ఈ రెండు పార్టీలే పోటీ చేస్తే… ఇక మిగ‌తా ఎన్డీయే ప‌క్షాలు అయిన లోక్‌జ‌న శ‌క్తి(ఎల్‌జేపీ), రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీ(ఆర్ఎల్ఎస్‌పీ)ల సంగ‌తేమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మిగిలిపోతోంది.

మా సీట్ల జోలికి రావద్దు…

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, ఎల్‌జేపీ, ఆర్ఎల్ఎస్‌పీలు ఉమ్మ‌డిగా బ‌రిలోకి దిగి 32 స్థానాల్లో విజ‌యం సాధించాయి. ఇక జేడీయూ రెండు స్థానాల్లోనే గెలిచింది. మ‌రోవైపు త‌మ సీట్ల‌కు కోత పెట్ట‌వ‌ద్దంటూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో కేంద్ర‌మంత్రి, లోక్ జ‌న‌శ‌క్తి నేత రాం విలాస్‌పాశ్వ‌న్ భేటీ అయి కోరారు. ఈ నెల 7న ఎన్డీయే ప‌క్షాలు స‌మావేశం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో జేడీయూ నేత‌లు వ్యూహాత్మ‌కంగానే బీజేపీ ముందు ఈ డిమాండ్ ఉంచిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఆదివారం రాత్రి ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ జేడీయూ కీల‌క‌నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుప‌డం కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

గత ఎన్నికల్లో 2 గెలిచి..ఇప్పుడు 25 కావాలా..?

ఆ స‌మావేశం అనంత‌రం జేడీయూ అధికార ప్ర‌తినిధి అజయ్ అలోక్ మాట్లాడుతూ.. 25 స్థానాల్లో జేడీయూ, 15 స్థానాల్లో బీజేపీ పోటీ చేయ‌డం ఆన‌వాయితీ అంటూనే కూట‌మిలో చాలా పార్టీలు ఉన్నాయి కాబ‌ట్టి అన్నిప‌క్షాల నేత‌లు చ‌ర్చించి సీట్ల సంఖ్య‌ను నిర్ణ‌యిస్తార‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే… గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో గెలిచిన జేడీయూకు బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 స్థానాలు కేటాయిస్తుందా..? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మిగిలింది. మ‌రోవైపు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే నితీశ్‌కుమార్ వ్యూహాత్మ‌కంగా ఆన‌వాయితీ డిమాండ్‌ను ముందుకు తెస్తున్నార‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి 2013లో ప్రధాని అభ్యర్థిగా మోడీని నీతీశ్‌ తీవ్రంగా వ్యతిరేకించిన విష‌యం తెలిసిందే. ఆ క్రమంలోనే ఎన్డీఏ నుంచి జేడీ(యూ) బయటకు వచ్చేసింది.

వేగంగా మారుతోన్న సమీకరణాలు

2014లో బిహార్‌లో రాజకీయ సమీకరణాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. అప్ప‌టివ‌ వరకూ జేడీ(యూ) 25 సీట్లలో, బీజేపీ 15 సీట్లలో పోటీ చేసేవి. కానీ, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎల్జేపీలతోపాటు ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) క‌లిసి కూట‌మిగా బరిలోకి దిగగా మొత్తం 32 సీట్లు వచ్చాయి. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు 6 స్థానాల్లో పాగా వేశాయి. జేడీ(యూ) మాత్రం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఈనెల 7న జ‌రిగే ఎన్డీయే ప‌క్షాల స‌మావేశంలో ఏం జ‌రుగుతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో తాము చెప్పిన‌ట్టుగానే జేడీ(యూ) పోటీ చేయాల‌ని… తాము ఇచ్చిన సీట్లే తీసుకోవాల‌ని బీజేపీ డిమాండ్‌ను తెర‌మీద‌కు తెస్తోన్న నేప‌థ్యంలో ఇప్పుడు నితీశ్ నుంచి దిమ్మ‌తిరిగే షాక్ ఆ పార్టీకి త‌గిలింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*