ప్యాలెస్ లో దొంగలు పడ్డారు…!

హైదరాబాద్ మహానగరం నాలుగువందల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. చారీత్రాత్మక కట్టడాలు, మసీదులు, దేవాలయాలు, అందమైన పరిసరాలు, ప్రకృతి సౌందర్యం, రాజభవనాలు ఇలా సమున్నతమైన నిర్మాణ కౌశల్యాన్ని ప్రతిబింబించే బాగ్యనగరం అనువణువూ ఓ ప్రత్యేకతను చాటుతోంది. ఇది నాణేనికి ఓవైపు మాత్రమే పాతబస్తిలోని పురానా హవేలిలో కాస్త తొంగి చూస్తే నిజాం నవాబుల రాజ భవనాలు వారి అధ్వర్యంలో ఏర్పడిన చారిత్రాత్మక మ్యూజియాలు చూస్తే కళ్లు చెదరక మానదు. స్వయానా నిజాం నవాబులు వినియోగించిన అరుదైన చారీత్రాత్మక సంపద నిజాం మ్యూజియంలో కనువిందు చేస్తోంది.చారిత్రాత్మక హైదరాబాద్ ని సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించవలసిన ప్రదేశం నిజాం మ్యూజియం. నిజాం ప్యాలస్ లో ఒక భాగమైన ఈ మ్యుజియం అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. దాదాపు 15ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిజాం మ్యూజియం ఉంది. అందమైన గార్డెన్ లు, అపురూపమైన పూరాతన భవనాలు వాహ్ అనిపించేలా రూపొందిచబడ్డాయి. అసలు కధ మరోటి ఉంది. ఆరో నిజాం మీర్ మహాబూబ్ అలిఖాన్ వినియోగించిన విలువైన వస్తువుల నుంచి ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలిఖాన్ స్వయానా వినియోగించిన వస్తువులు ఈ మ్యూజియంలో హైలెట్.

కళాఖండాలు ఎన్నో…..

ఇందులో ఎన్నో చిత్రలేఖనాలు, ఆభరణాలు, ఆయుధాలు, ఉర్దూ తెలుగు బాషలో ఉన్న రచనలు, నిజాంరాజు వినియోగించిన దుస్తులు, డైనింగ్ టెబుల్ సామగ్రి, చార్మీనార్ నమూనా, అల్మారాలు, గడియారాలు, బంగారు స్పూన్లు, పాత్రలు, వంట సామాగ్రి ఇలా పురాతన కార్లు వంటివి మ్యూజియంలో ఉన్నాయి.నిజాం రాజులు అందుకున్న ఎన్నో జ్ఞాపికలు, వివిధ కానుకలు ఈ మ్యూజియంలో నిక్షిప్తమై ఉన్నాయి. వెండితో తయారు చేయబడిన హైదరాబాద్ నగరానికి చెందిన చారిత్రక చార్మినార్ నమూనా ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచబడింది. చెక్క మరియు బంగారంతో చేయబడిన నిజాం సింహాసనం హైలెట్. అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా చెక్కబడిన వెండి సీసాలు, వెండితో చెయ్యబడిన కాఫీ కప్పులపై అలంకరించిన వజ్రాలు, చెక్కతో చెయ్యబడిన రైటింగ్ బాక్స్ ఇలాంటివి కొన్ని అత్యద్భుతమైన వస్తువులు మ్యూజియంలో ఉన్నాయి.

వజ్రాలు…వైఢుర్యాలు…..

వజ్రాలతో పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, వెండితో తాయారు చేసిన ఏనుగు, మావటి వాడి శిల్పం వంటివి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే కళాఖండాలు. రోల్స్ రాయ్స్ కారు చెందిన నమూనా అలాగే జాగ్వర్ మార్క్ కారులకు చెందిన నమూనాలు, పొడవాటి ఎత్తైన అద్దాలు చూపరులను అకట్టుకుంటున్నాయి. కాని విలువైన సంపద ఉన్న ఈ ప్రాంతంలో సెక్యూరిటి వైఫల్యం కారణంగా భారి మూల్యం చెల్లించుకొవాల్సి వచ్చింది. ముఖరంజా ట్రస్ట్ వారు మ్యూజియంను సక్రమంగా నడిపిస్తున్నారనుకుంటే దొంగల పాలైంది. దీంతో నిజాం ముని మనువలు కంటతడిపెట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. దొంగలు విలువైన బంగారు వస్తువులను దొంగిలించడంతో పోలిసులు సైతం సీన్ అఫ్ అఫెన్స్ చూసి అవాక్కయ్యారు. నిజాం కాలం నాటి సువర్ణ, వజ్ర ఖచిత పురాతన వస్తువులు, కప్ సాసర్ స్పూన్ ఎత్తుకెళ్లారని నగర అదనపు సీపి షికా గోయల్ తెలిపారు. దుండగులు పక్కా ప్లాన్‌తో సీసీ కెమెరాలలో పడకుండా దొంగతనానికి పాల్పడ్డారన్నారు. పురానీ హవేలి మస్రత్‌ మహల్‌లోని నిజాం మ్యూజియంలో సుమారు రెండు కిలోల బరువుతో వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌ బాక్స్‌, చెంచా, కప్పు సాసరును ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

175రకాల విలువైన వస్తువులు……

1935లో పురానీహవేలిలో జరిగిన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో బాగంగా నిజాం నవాబుకు సామంతులు, రాజులు, అయా దేశాల ప్రతినిధులు చాలా ఇష్టంగా ఇచ్చిన దాదాపు 175 రకాల అరుదైన విలువైన వస్ధువులు నిజాం మ్యూజియంలోనే ఉన్నాయి. జీ ప్లస్ టూ సామర్ధ్యం గల నిజాం మ్యూజియంలో దాదాపు 43కు పైగా లాంగ్ గ్యాలరీలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో ప్రతిదీ విలువైన, అరుదైన వస్తువే. పైగా ఇందులో వజ్రాలతో పొదిగిన అనేక సంపద, అలాగే బంగారంతో రూపొందించిన అనేక పాత్రలు, బాక్సులు, విలువైన డైమండ్స్ తో కూడిన రిస్ట్ వాచ్ లు, నిజాం కూర్చునే బంగారంతో రూపొందించిన దర్బార్ మహాల్, రాణి మహాల్ అందులోని వస్తువుల విలువ బహిరంగ మార్కెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ ఉంటుందని ముఖరంజా ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.

రెండువేల సంవత్సరం నుంచి…..

ఫిబ్రవరి18, 2000 సంవత్సరంలో సాదారణ ప్రజలు వీక్షించేలా నిజాం మ్యూజియంలో అనుమతిచ్చారు ముఖరంజా ట్రస్ట్ సభ్యులు. అలాగే సెక్యూరిటి భాద్యతలు సైతం వీరి అధీనంలోనే ఉన్నాయి. ఉదయం నలుగురు, రాత్రి వేళ ఐదుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిజాం మ్యూజియంలో కేవలం 10మంది సెక్యూరిటి ఉండడం గమనార్హం. అలాగే వీరికి కనీస అవగాహాన లేకపొవడం విడ్డూరం. ఇక 15వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిజాం మ్యూజియంలో కేవలం 10 సిసి కెమరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. సెక్యూరిటీ వైఫల్యం కారణంగా నిజాం సంపద చోరికి గురైంది. నిజాం మ్యూజియానికి మరో పేరు కూడా ఉంది. ద మదర్ అఫ్ పర్ల్స్ మ్యూజియం అని….. ఎందుకంటే నిజాం తన తల్లికి ఇష్టంగా బహుకరించిన డైమండ్ గోల్డ్ స్టడీడ్ ఈ మ్యూజియంలోనే ఉన్నాయంటున్నారు స్ధానికులు. అలాగే ఇప్పుడు ఈ విలువైన సంపద ఉందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో విలువైన వస్తువలు నిజాం మ్యూజియంలోని రాణి మహాల్ లో ట్రస్ట్ సభ్యులు ఉంచారన్న వాదనలు ఉన్నాయి.

వందకోట్లకు పైగానే…..

ఇక నిజాం మ్యూజియంతో పాటు ఈ అవరణలో ఉన్న ముఖరంజా ఉమెన్స్ కాలేజ్, ముఖరంజా స్కూల్, ముఖరంజా హాస్పిటల్ ను ముఖరంజా ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. 14 సంవత్సరాల క్రితం పురానిహావేలి ప్రాంతంలో ఉన్న అఘఖాన్ లో 14సంవత్సరాల క్రితం అల్మారాలో కొన్ని వందల కోట్ల విలువ చేసే విలువైన వస్దువులు మాయమైన ఘటనలో ఇప్పటివరకు దోషులెవరో తేలలేదు. 14సంవత్సరాల తరువాత ఈనెల 2న అదివారం తెల్లవారు జామున భారీ చోరి ఘటన చర్చనీయాంశంగా మారింది. నిజాం మ్యూజియంలో చోరికి గురైన వజ్రాలతో రూపొందించిన 2కిలోల టిఫిన్ బాక్స్ తో పాటు రెండు పొడవాటి కప్పులు. ఓ సాసర్. టి స్పూన్ సంపద విలువ బహిరంగ మార్కెట్లో 100కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. అలాగే 18వ శతాబ్దం నుంచి వినియోగించిన అపురూపమైన వస్తువులు నిజాం మ్యూజియంలో ఉన్నాయి. ఈ భవనంలో నిజాం 100సంవత్సరాల క్రితమే అతిపెద్ద లిఫ్ట్ ను సైతం ఏర్పాటుచేశారంటే అనాటి కళ నైపణ్యం ఎంత గొప్పదో ఇట్టే అర్ధమవుతోంది. చారీత్రాత్మక సందపకు నెలవైన నిజాం మ్యూజియంకు, నిజాం ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖరంజా ట్రస్ట్ సభ్యుల పేలవమైన సెక్యూరిటి వైఫల్యం కారణంగా చెడ్డపేరును మూటగట్టుకుంటోంది. ఈఘటన తరువాతైనా ట్రస్ట్ సభ్యులు మేలుకుంటారా….? భద్రతపరమైన అంశాలు ఎవరు టేకప్ చేస్తారో వేచిచూడాలి మరి.

Ravi Batchali
About Ravi Batchali 16983 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*