పవన్ అసలు ‘‘పవర్’’ ఇదేనా?

ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇతర సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరుబాటకు సిద్ధయ్యారు. ఈ నెల 20వ తేదీ నుంచి పోరాటాల పుట్టినిల్లు శ్రీకాకుళం నుంచి పోరుబాట ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ గురువారం విశాఖపట్నంలో ప్రకటించారు. మొదటి విడతగా మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పోరుబాట ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన ఇచ్చాపురం తీరప్రాంతంలో గంగాపూజ చేసి 45 రోజుల యాత్ర ప్రారంభించనున్నట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…‘‘ప్రత్యేక హోదా పైన జనసేన మొదటి నుంచి ఒకే మాట చెప్తోంది. కాకినాడలోనైనా, అనంతపురంలోనైనా విభజన హామీలు నెరవేర్చాలని గట్టిగా చెప్పాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ప్రజలకే కానీ రాజకీయ నాయకులకు లేదు’’ అన్నారు పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్రలో ఇంకా వలసలు, వెనుకబాటుతనం బాధాకరమన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరోసారి రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని, వైఫమ్యాలు పెరుగుతాయని, ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

పక్కా ప్రణాళికతో….

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర నిర్వహిస్తారని ఇప్పటివరకు వినిపించింది. కానీ, తనది కేవలం బస్సుయాత్ర మాత్రమే కాదని, తన పోరుబాటలో పాదయాత్ర ఉంటుందని, బస్సుయాత్ర ఉంటుందని, సమస్య ఉన్నచోటకు ఎలా వెళ్లాల్సి ఉంటుందో అలా వెళతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీల అమలుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలపై తాను పోరాడనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా  ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువతతో కవాతు నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో లక్ష మందితో కవాతు జరుపుతామని తెలిపారు. జనసేన కూడా కొన్ని విషయాలను ఇంకా నేర్చుకోవాల్సి ఉందన్నారు. సమస్యలను తెలుసుకోవడం, అధ్యయనం చేయడం మాత్రమే కాదు వాటి పరిష్కారం ఎలా అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్దానం సమస్యలో తన ప్రయత్నానికి ప్రభుత్వం సహకరించలేదన్నారు.

రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీనే…

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీనే ఉండనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికలపై స్పందించిన ఆయన ఎలాగైనా బీజేపీ అధికారం  తమదేనని చెప్పాలని భావించిందన్నారు. బీజేపీ విధానాన్ని ఏ పార్టీ కూడా గట్టిగా ప్రశ్నించలేవని, అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయన్నారు. ఇన్నేళ్లు ఆ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నీరు గారుస్తూ ఈ పరిస్థితికి తీసుకోచ్చాయన్నారు. ఈ పరిస్థితి మార్చడమే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, జనసేన అధికారంలోకి వస్తే అన్ని జిల్లాల్లో అమరవీరుల స్మృతిచిహ్నాలను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*