రాహుల్ ఎందుకిలా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నిలకడ లేని మనస్తత్వం, తొందరపాటు నుంచి పూర్తిగా బయట పడనట్లున్నారు. ఆయన ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో పాల్గొని జాతీయ గీతం పాడటానికి సమయం లేదని చెప్పి విమర్శల పాలయ్యారు. రాహుల్ అంత బిజీనా, కాంగ్రెస్ అధ్యక్షుడికి కనీసం జాతీయ గీతం ఆలపించే సమయం లేదా..? అని విమర్శలు కురిపించారు. అయితే, ఇప్పుడు తాజాగా మరోసారి రాహుల్ ఇటువంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. రాహుల్ నిన్న మహారాష్ట్రలో పర్యటించారు. అయితే, ముంబైలో రాహుల్ మీడియా సమావేశం ఏర్పాటుచేసింది ఆ పార్టీ. ఈ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్ లైన్ మీడియాకు చెందిన సుమారు 100 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. పైగా ముంబైలో రాహుల్ మొదటి ప్రెస్ మీట్ అది. దీంతో జర్నలిస్టులు కూడా అనేక ప్రశ్నలతో సిద్ధమయ్యారు. ఉదయం 8.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, రాహుల్ తీరిగ్గా 9.20 గంటలకు చేరుకున్నారు. సరే కదామొత్తానికి వచ్చారు అని జర్నలిస్టులు కొంత అసహనం ఉన్నా సర్ధుకున్నారు. అయితే, మాట్లాడటం ప్రారంభించిన రాహుల్ కేవలం రెండు నిమిషాల 40 సెకెన్లు మాత్రమే తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయాడు. దీంతో జర్నలిస్టులకు మండిపోయింది.

సోషల్ మీడియా వేదికగా విమర్శలు…

ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులు రాహుల్ పై, కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ‘ముంబై జర్నలిస్టులు.. రాహుల్ ప్రెస్ మీట్ కోసం 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరారు. ఇది నా జీవితంలో అతి చిన్న ప్రెస్ మీట్. నేను కోల్పోయిన నిద్రకు సమాధానం కావాలి’ అని ఓ జర్నలిస్టు ట్వీట్ చేసింది. ‘అతి తక్కువ సమయంలో ముగిసిన ప్రెస్ మీట్ గా గిన్నీస్ బుక్ ఎక్కనున్న దానికి నేను ప్రత్యక్ష సాక్షిని’ అని మరో జర్నలిస్టు ఎద్దేవా చేశారు. అయితే, సమాచారలోపం వల్లే ఇలా జరిగిందని ముంబై కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ తెలిపారు. నాగపూర్ కి వెళ్లే ముందు ఇక్కడి మీడియాకు బైట్ ఇస్తానని రాహుల్ చెప్పారని, కానీ, పార్టీ మీడియా సమన్వయకర్తలు మాత్రం ప్రెస్ మీట్ గా పొరబడ్డారని సంజాయిషీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*