మాకు ఇచ్చిన హామీలు అమ‌లు చేసి తీరాలి

విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ…ఇదే స‌భ‌లో, అంద‌రి ముందు చేసిన చ‌ట్టాన్ని అమ‌లు చేయాల్సింది కేంద్ర‌మే అని, కేంద్ర‌మే మోసం చేస్తే తాము ఎవ‌రిని అడ‌గాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాలుగేళ్ల‌లో చ‌ట్టంలోనే ఏ ఒక్క హామీని కూడా నెర‌వేర్చ‌కుండా కాల‌యాప‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ‌లో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని అర్హ‌త‌లు ఉన్నా చేయ‌డం లేద‌ని పాత పాట‌నే వ‌ల్లె వేస్తున్నార‌ని అన్నారు. జాతీయ సంస్థ‌ల ఏర్పాటుకు అర‌కొర నిధులు మంజూరు చేస్తున్నార‌ని, ఇప్పుడు ఇస్తున్న‌ట్లుగా నిధులు ఇస్తే జాతీయ సంస్థ‌లు క‌ట్ట‌డానికి 80 ఏళ్లు ప‌డుతుందన్నారు.

నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారు.

ప్ర‌త్యేక హోదా క‌లిగిన రాష్ట్రాల‌కు టాక్స్ ఇన్సెంటీవ్స్ ఉండ‌వ‌ని బీజేపీ ఎంపీ హ‌రిబాబు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని, కానీ, కేంద్ర మంత్రే ఇంత‌కుముందు టాక్స్ ఇన్సెంటీవ్స్ ఉంటాయ‌ని చెప్పారని గుర్తు చేశారు. గుంటూరు, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం స‌భ‌ల్లో ఢిల్లీ కంటే మెరుగైన రాజ‌ధాని క‌డ‌తామ‌ని ప్ర‌దాని న‌రేంద్ర మోదీ హామీ ఇచ్చార‌ని, ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పార‌ని, కానీ నాలుగేళ్లుగా మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. హోదా, జోన్ విష‌యాల్లో రాజ్‌నాథ్ సింగ్ చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌న్నారు. బీజేపీ ఎంపీ హ‌రిబాబు విశాఖ‌ప‌ట్నం నుంచి గెలిచి ఢిల్లీ మాట‌లుమాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*