పోలీసు నోటీసులపై రేవంత్ కామెంట్స్..!

కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని కేసీఆర్ చూస్తున్నాడని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ… తనకు పోటీగా ఉన్న ఒక సామాజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్భందాల ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసులు పెట్టి తాను ప్రచారం చేయకుండా దిగ్భందం చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపించారు.

అధికారులు గుర్తుపెట్టుకోవాలి..!

కేసీఆర్ మంచి చేసినా, చెడు చేసినా తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో కలిపి బాకీ తీర్చుకుంటామని స్పష్టం చేశారు. తాను కేసులకు, అరెస్టులకు భయపడేది లేదన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని అధికారులు భావిస్తున్నారని, టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అధికారుల పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని… కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే విషయాలను అధికారులు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.