స్పీకర్ వద్ద జరిగిందిదేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త దారులు వెతుకుతోంది. స్పీకర్ విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. అయినా, కూడా తెలంగాణ ప్రభుత్వం వీరి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో మరోసారి కోర్టుకు వెళ్లింది ప్రభుత్వం. అయితే, అక్కడా టీఆర్ఎస్ కి చుక్కెదురైంది. అయినా, కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రజలవద్దకు తీసుకెళ్లడంతో పాటు జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది.

స్పీకర్ తో రేవంత్ రెడ్డి వాగ్వాదం…

ఈ మేరకు మొదటి ప్రయత్నంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సోమవారం స్పీకర్ మధుసుదనాచారిని కలిశారు. సభ్యత్వాలను రద్దు చేయాలని వారు స్పీకర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి, స్పీకర్ కి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కోర్టు చెప్పినా సస్పెన్షన్లు ఎందుకు ఎత్తేయరని రేవంత్ రెడ్డి స్పీకర్ ని కొంచెం గట్టిగానే ప్రశ్నించారు. దీంతో ఇలా మాట్లాడితే తాను వెళ్లిపోతానని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పారు. తనకు మీరు న్యాయం చెస్తారని నమ్మకం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి నేరుగా స్పీకర్ తోనే చెప్పారు. ఇక నెక్ట్స్ స్టెప్ గా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాలని, దీంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయికి వెళుతుందని భావిస్తున్నారు. తామను ఎమ్మెల్యేలుగా గుర్తించకపోవడం వల్ల నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కోన్ని సంక్షేమ పథకాల అమలుకు ఎమ్మెల్యే సంతకం తప్పనిసరి అని, దీంతో అవి ఆగిపోయాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.