అభివృద్ధి ఆగకూడదనే చేరుతున్నా..!

నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా పాలిస్తున్నారని, మంచి పథకాలను ప్రవేశపెట్టారని, ఆ పాలన కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేటీఆర్ ఆహ్వానం మేరకు సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ పోరాటంలో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, మరికొన్నిసార్లు పరోక్షంగా కేసీఆర్ తో పనిచేసినట్లు తెలిపారు.

టిక్కెట్లు కన్ ఫర్మ్ అయినా……

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ హయాంలో నిశబ్ద అభివృద్ధి, విప్లవం కనపడుతోందని పేర్కొన్నారు. టిక్కెట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయినా… రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా కేసీఆర్ పాలన వచ్చేసారి కూడా కొనసాగాలనే టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్ పాలన కొనసాగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ లో చేరాక ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య రాయబారిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. త్వరలో మిత్రులు, అభిమానులతో చర్చించి పార్టీలో చేరే తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.