భూకంపం పుట్టలేదేంది ముఖ్యమంత్రి గారూ..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ది రహస్య ఒప్పందమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల గురించి మోదీ ముందు ప్రస్తావించకుండా ఆ వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…పునర్విభజన బిల్లులో ఉన్న హామీలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేక పోతున్నారని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఎందుకు రాలేదన్నారు. వ్యక్తిగత లాభం కోసమే కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ తరుపున సర్వే చేయిస్తున్నామని, బలమైన అభ్యర్థులకే టిక్కట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సిట్టింగ్ లు, సీనియర్ లు ఉన్న స్థానాల్లో సర్వే అవసరం లేదన్నారు.