ఆ ఘటనపై జగన్ సంచలన ఆరోపణలు

y.s.jaganmohnreddy-prajasankalpapadayathra

తనపై హత్యాయత్నంలో చంద్రబాబు నాయుడు కుట్ర లేకపోతే స్వతంత్ర సంస్థతో విచారణ చేయించడానికి ఎందుకు వెనక్కుపోతున్నాడని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం ఘటన తర్వాత మొదటిసారిగా ఇవాళ పార్వతిపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ ఘటనపై పలు ప్రశ్నలు, అనుమానాలు లేవనెత్తారు. జగన్ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఆయన మాటల్లోనే…
– చంద్రబాబుకు రాజకీయంగా పోటీగా ఉన్న వ్యక్తి ఎవరినైనా అడ్డుతొలగించుకోవడానికి వెనక్కుపోని వ్యక్తి. ప్రతిపక్ష నాయకుడిని కూడా తొలగించడానికి వెనక్కుపోని వ్యక్తి.
– జగన్ అనే వ్యక్తి చేసిన తప్పేంటి ? నీ అన్యాయమైన పాలనపై ప్రజల తరపున పోరాటం చేసి ప్రశ్నించినందుకు నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నించారా..?
– నాపై హత్యాయత్నం మీ కుట్రలో భాగంగా జరగలేదా..?
– నవంబర్ 6న నా పాదయాత్ర మొదలైంది. మార్చి నాటికి పాదయాత్ర మహోన్నత రూపంలోకి మారింది. మార్చి 8న మీరు కేంద్రం నుంచి వైదొలిగారు. మార్చి 22న ఆపరేషన్ గరుడ తెరపైకి తీసుకువచ్చారు.
– చంద్రబాబుకు సన్నిహుతుడైన సినీ యాక్టర్ కు శిక్షణ ఇచ్చి మీడియాను జతచేసి ప్రెస్ మీట్ పెట్టించి యెల్లో మీడియాలో ప్రచారం చేశారు. ప్రతిపక్ష నేత మీద దాడి జరిగి రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అతడు చదివాడు.
– కత్తిదాడిలో ప్రతిపక్ష నేత చనిపోతే ఎయిర్ పోర్టు భద్రత తన పరిధిలోని కాదని తప్పించుకోవాలని, విఫలమైతే ఆపరేషన్ గరుడలో భాగం అని చెప్పడం మీ కుట్ర కాదా ?
– రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి చంద్రబాబు సన్నిహితుడు. అందులో పనిచేసే వాడు కత్తులు తీసుకుని వీఐపీ లాంజ్ లోకి రాగలిగాడు.
– హత్యాప్రయత్నం జరిగిన గంటకే చంద్రబాబు స్క్రిప్ట్ ప్లే చేస్తూ డీజీపీ, హోంమంత్రి, మంత్రులు మీడియా ముందుకు వచ్చి నిందితుడు జగన్ అభిమాని అని చెబుతారు. ముఖ్యమంత్రి అయ్యాక నేను బాగా పనిచేయాలి అనుకున్న వ్యక్తి నన్నేందుకు చంపాలనుకుంటాడు ?
– ఓ ఫ్లెక్సీ విడుదల చేశారు. అందులో రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ ఫోటో లేకుండా గరుడ పక్షి ఫోటో ఎందుకు ఉంది ?
– ఘటన జరగగానే అందరి ముందే సీఐఎస్ఎఫ్ అధికారులు నిందితుడి జేబులో ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెతికితే ఏమీ లేవు. కానీ తర్వాత ఓ ఉత్తరం ఎలా వచ్చింది ? అందులో రెండుమూడు రకాల చేతి రాతలు ఎందుకు ఉన్నాయి ? ఆ ఉత్తరంలో మడతలు కూడా లేవు. ఇస్త్రీ చేసినట్లుగా ఉత్తరం ఉంది. ఇదంతా కుట్ర కాదా ?
– ఆగస్టు నెలలో నేను విశాఖపట్నం జిల్లాలో అడుగుపెట్టగానే ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోవడం కుట్ర కాదా ?
– చంద్రబాబు కుట్ర చేసి తన తల్లి, చెల్లి కుట్ర చేసిందని చంద్రబాబు చెప్పించడాంటే అసలు చంద్రబాబు ఒక మనిషేనా ?
– హత్యాయత్నం జరగగానే తెలిసీతెలియక ఎవరిపైనా నేను అబాంధాలు వేయలేదు. డ్రామాలు అంతకన్నా చేయలేదు. రక్తంతో తడిచిన నా షర్టు కూడా వెంటనే మార్చుకున్నా. విమానం ఎక్కేటప్పుడే నాకు ఏమీ కాలేదు అని ట్వీట్ కూడా చేశాను.
– అప్పటికే ఫైనల్ కాల్ రావడంతో హైదరాబాద్ వెళ్లి మెరుగైన చికిత్స చేసుకుందామని వెళ్లి నేరుగా ఆసుపత్రికి వెళ్లాను. కానీ, నేను ముందుకు ఇంటికి వెళ్లానని, బీజేపీ నేతలు ఫోన్ చేశాక హాస్పిటల్ కి వెళ్లాలని దారుణంగా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. నా సెక్యూరిటీ అంతా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే. నేరుగా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం చంద్రబాబుకు తెలియదా.
– హత్య చేయడానికి చంద్రబాబే కుట్ర చేస్తాడు. విచారణ కూడా ఆయనే చేస్తే న్యాయం జరుగుతుందా ?
– కేవలం కాంగ్రెస్ ని వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ తో కుమ్మక్కై ఆనాడు సీబీఐ ముద్దు అని నాపైన కేసులు వేయించారు. మరి, ఇవాళ నాపై హత్యాయత్నం, ఓటుకు నోటు కేసు, రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపితే జైలుకు పోతావని వణికిపోతూ సీబీఐ వద్దు అంటారా ? మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు మోదీపై యుద్ధం అంటున్నావు.