కాంగి‘‘రేసు’’లో ఎంతమందో…?

బీజేపీని అయతే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. కాని ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందా? క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి విన్పిస్తున్న డిమాండ్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి కాంగ్రెస్ నేతలకు. తాను రెండు సార్లు విజయం సాధించానని, తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నియోజవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే తమ అనుచరుల చేత కార్యక్రమాలను షురూ చేశారు. సీనియర్ నేతను ఓడించానని ఒకాయన, కాంగ్రెస్ పట్ల విశ్వాసంతో ముప్ఫయి ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్నానని మరొకాయన ఇలా…మంత్రి పదవుల కోసం అప్లికేషన్లుపెట్టేసుకుంటున్నారు. బలపరీక్ష తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ అని కుమారస్వామి తేల్చి చెప్పడంతో ఈ వత్తిడి కాంగ్రెస్ పై మరింత పెరిగే అవకాశముంది.

వంద నియోజకవర్గాల్లో డిపాజిట్లు….

కర్ణాటకలో 37 సీట్లు సాధించిన జనతాదళ్ (ఎస్)కు సీఎం పదవి ఇచ్చేసి, 78 సీట్లు సాధించిన తాము డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. ఇదంతా కేవలం కమలం పార్టీపై కసితోనే. దక్షిణాదిన ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోకూడదన్న ఏకైక కారణమే కాంగ్రెస్ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసేలా చేసింది. వాస్తవానికి కన్నడ ప్రజలు జేడీఎస్ ను పూర్తిగా తిరస్కరించారు. దాదాపు 87 శాతం మంది ప్రజలు గౌడ కుటుంబ పార్టీని పక్కన పెట్టారు. సుమారు వంద నియోజకవర్గాల్లో జేడీఎస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే కన్నడ ప్రజలు జేడీఎస్ కు ఏమాత్రం విలువ ఇవ్వలేదనే అర్థమవుతోంది.

యాభై మందికి పైగానే…..

అలాటి పార్టీకి చెందిన నేతనుకాంగ్రెస్ ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది. పదవుల పందేరంలోనూ 12 పదవులు జేడీఎస్ కు, 22 మంత్రి పదవులు కాంగ్రెస్ కు ఇవ్వాలన్న ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లో గెలిచిన 78 మందిలో దాదాపు 50 మందికి పైగానే మంత్రి వర్గ రేసులో ఉన్నట్లు సమాచారం. వీరంతా కాంగ్రెస్ పెద్దలకు తమ మనసులో మాటను చెప్పేశారు. గత ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మంత్రి పదవులు దక్కలేదని, ఈసారైనా అవకాశం కల్పించాలని మరికొందరు కోరుతున్నారు.

కుమారుల కోసం…..

ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ ఇన్ ఛార్జి వేణుగోపాల పార్టీ నేతలతో పదవుల పందేరం పై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక్కడ సిద్ధరామయ్య ఒక జాబితా, మల్లికార్జున ఖర్గే మరొక జాబితా, వీరప్ప మొయిలీ ఇంకొక జాబితాను సిద్ధం చేశారు. సామాజిక సమీకరణాల వారీగా మంత్రి పదవులకు ఎంపికచేయాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్ స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సిద్ధూ తన కుమారుడు యతీంత్రకు, మల్లికార్జున ఖర్గే తన వర్గం వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ పదవులు పందేరంపై కర్ణాటకలో తేలే విషయం కాదని, ఢిల్లీలో టెన్ జన్ పథ్ లోనే తేల్చాలని మరికొందరు చెబుతున్నారు. మొత్తం మీద మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో అప్పుడే సిగపట్లు ప్రారంభమయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.