బెజవాడకు జగన్ వచ్చే ముందే?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించగానే టీడీపీ అప్రమత్తమయింది. జగన్ పాదయాత్ర ప్రభావం కన్పించకుండా చేసేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. జగన్ పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అయితే దీనికంటే ముండుగానే టీడీపీ నేతలు జగన్ పై ప్రచారాన్ని ఉధృతం చేశారు. జగన్ పట్టిసీమను వ్యతిరేకించారని, డెల్టా రైతాంగానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే జగన్ పాదయాత్ర జిల్లాలో చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పట్టిసీమతో డెల్టా రైతాంగం పంటలు పండించుకుంటుంటే జగన్ ఓర్వలేక పోయారని, పట్టిసీమకు అడుగడుగునా అడ్డంకులు తగిలారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

జగన్ పై విమర్శలు….

ఇక రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొందరిచేత కూడా మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ పై విమర్శలు చేయించారు. రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేక పోతున్నారని, తాము ఆనందంగా భూములిస్తే, వైసీపీ న్యాయస్థానాలను ఆశ్రయించి రాజధాని నిర్మాణానికి ఆటంకం కల్గిస్తుందని కొందరు రైతులు జగన్ పై ఆరోపణలు చేశారు. రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని చెప్పిన తర్వాతనే జిల్లాలో అడుగుపెట్టాలని వారు కోరారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు.

నిరసన తెలియజేస్తారా?

రాజధాని నిర్మాణం, పట్టిసీమను అడ్డుకున్న జగన్ ను నిలదీయాలని కూడా పిలుపునిస్తున్నారు. ఈనేపథ్యంలో జగన్ పాదయాత్ర ఉత్కంఠల మధ్య సాగనుంది. జగన్ ఇప్పటి వరకూ చేసిన జిల్లాలు ఒక ఎత్తని, కృష్ణా జిల్లా ఒక ఎత్తని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇందుకోసం వారు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. రాజధాని రైతుల చేత జగన్ పాదయాత్రలో నిరసన వ్యక్తం చేయాలన్నది కూడా వారి ప్లాన్ లో ఉందని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. అయితే తమ అధినేత మాత్రం ప్రభుత్వం చేసిన తప్పులను తప్పకుండా ఎత్తి చూపుతారని అంటున్నారు.

బెజవాడలో విభేదాలు….

మరోవైపు బెజవాడలో అడుగుపెడుతున్న జగన్ కు పార్టీ పరంగా సమస్యలూ స్వాగతం చెప్పనున్నాయి. టీడీపీ నేత యలమంచిలిరవి పార్టీ చేరారన్న ఆనందంలో ఉన్నప్పటికీ నేతల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. వంగవీటి రాధా, గౌతమ్ రెడ్డికి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయి. వంగవీటి రంగా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆయన పాదయాత్రలో ఉన్న జగన్ ను కలసి రావడం వంగవీటి వర్గంలో ఆగ్రహాన్ని కల్గించింది. మరోవైపు మల్లాది విష్ణు, వంగవీటి రాధాకు కూడా పడదు. ఈ నేపథ్యంలో పార్టీలో నేతల మధ్య విభేదాలు జగన్ కు తలనొప్పిగా మారతాయా? అన్న సందేహం కూడా ఉంది. మరి బెజవాడలో జగన్ పాదయాత్ర ఎలా జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*