
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు అభ్యర్థులను పోటీలోకి దింపుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అభ్యర్థులెవరనేదీ పక్కన పెడితే ఈ రెండు పార్టీలూ గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తాయి. వాస్తవానికి నంద్యాల నియోజకవర్గం వైసీపీదే. వైసీపీ గుర్తుమీదనే భూమా నాగిరెడ్డి గెలుపొందారు. అందుకే ఆ సీటు తమదేనంటోంది వైసీపీ. ఇక అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం తమ పార్టీలో చేర్చుకున్న నేత మరణించినా… ఆ సీటును ఉప ఎన్నికల్లో గెలుచుకుని తీరతామంటోంది. సో…రెండు పార్టీలూ నంద్యాల ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెడతాయన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అభ్యర్థుల ఎంపికలోనే రెండు పార్టీలూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప తాము అధికారికంగా ప్రకటించబోమంటోంది వైసీపీ. రెండు పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువమందే ఉండటంతో నోటిఫికేషన్ ఇంకా రాలేదు గదా? అని అభ్యర్థుల ఎంపికను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాయి రెండు పార్టీలు.
పోటీకి దిగాలా? వద్దా?
అయితే ఇదిలాగుంటే నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికను 2019 ఎన్నికలకు రిహార్సల్స్ గా కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వామపక్షాలు కూడా మద్దతిచ్చే అవకాశముంది. అయితే ఇటీవల ప్రత్యేక హోదాపై గుంటూరులో జరిపిన రాహుల్ సభ సక్సెస్ కావడంతో నంద్యాలలో తమ ఉనికిని చాటు కోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందుకోసం వామపక్షాల మద్దతుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయాన్ని కూడా కాంగ్రెస్ కోరే అవకాశముంది. ఇటీవల ప్రత్యేక హోదా సభకు తాను రాలేకపోయానని, హోదా కోసం ఏ పార్టీ ఆందోళన చేసినా తాను అండగా ఉంటానని పవన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసమే నంద్యాల ఉప ఎన్నికను ప్రత్యేక హోదా ఆంకాక్షకు నిదర్శనంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. పవన్ కల్యాణ్ ను కలిసి తమ ప్రతిపాదనను ఆయన ముందుంచాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో ఇంకా అభ్యర్ధిని నిలబెట్టాలా? లేదా? అన్న అంశం చర్చిస్తున్నామని, తాము ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరతామని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రత్యేక హోదా బీజేపీ ఇస్తుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటున్నారు. మరి కాంగ్రెస్ నేతల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Leave a Reply