అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు

తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహనరావు మీడియా ముందుకొచ్చారు. తనపై ఐటీ దాడులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. తన కొడుకు పేరు మీద వారెంట్ తీసుకొచ్చి నా ఇల్లు ఎలా సోదా చేస్తారని ప్రశ్నించారు. అమ్మ జయలలిత ఉంటే ఇలా జరిగేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం, పన్నీరు సెల్వంపై ఆయన మండిపడ్డారు. తాను ఆంధ్రవాడిని కనుకనే కక్ష కట్టి మరీ దాడులు చేయించారన్నారు. తన ఇంట్లో 40 తులాల బంగారు, 25 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు మాత్రమే ఐటీ దాడుల్లో బయటపడిందని చెప్పారు. జయలలిత లేకపోవడంతో తమిళనాడులో భద్రత కరువైందన్నారు. తనను సీఎస్ గా తొలగించడంపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. రామ్మోహనరావు వ్యాఖ్యలతో పన్నీరుసెల్వం, శశికళ అండ్ కో మధ్య విభేదాలు తలెత్తినట్లు స్పష్టమవుతోంది. రామ్మోహనరావు తొలి నుంచి జయలలితకు అండగా ఉంటూ వచ్చారు. రామ్మోహనరావు కంటే 15 మంది సీనియర్లను కాదని జయ ఆయనను చీఫ్ సెక్రటరీగా చేశారు.

రామ్మోహనరావు పేరును చిన్నమ్మే జయకు సూచించారు. దీంతో శశికళ శిబిరానికి, పన్నీరు సెల్వం బ్యాచ్ కి మధ్య అంతర్గత యుద్ధం నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. పన్నీరు సెల్వమే కేంద్రప్రభుత్వం ద్వారా రామ్మోహనరావుపై ఐటీ దాడులు చేయించారని శశికళ వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జరగనున్న అన్నా డీఎంకే సర్వ సభ్య మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని నటరాజన్ యోచిస్తున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ ఎంపిక అంత ఈజీ కాదని తేలిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*