
ప్రజా సమస్యలకు, వాటి పరిష్కారానికి వేదిక కావాల్సిన ఏపీ అసెంబ్లీని సీఎం చంద్రబాబు తన స్వోత్కర్షకు, పరనిందకు ఎడా పెడా బాగానే వాడేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం అసెంబ్లీ నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కరోజు చేసే ఖర్చు అక్షరాలా 23 లక్షలు. విద్యుత్ బిల్లు, ఎమ్మెల్యేల భత్యం, అలవెన్సులు, వాహనాల చమురు ఖర్చు, ఆహారం, టీ, స్నాక్స్ వంటి వాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు.
బడ్జెట్ సమావేశాలంటే ఇవేనా?
ఒకవేళ నిర్ణీత సమయం కన్నా ఓ గంటో రెండు గంటలో సభ ఎక్కువ సమయం జరిగితే.. అలవెన్సులు మరింత పెరిగి ఈ ఖర్చు మరో 5 నుంచి ఆరు లక్షలకు పెరుగుతుందని ప్రభుత్వమే ఓ సందర్భంలో వెల్లడించింది. మరి ఒక్క రోజు కోసం ఇన్ని లక్షల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి మరీ నిర్వహిస్తున్న ఈ సభలు ఎవరికి ప్రయోజన కరంగా మారుతున్నాయి? ఎన్ని ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? పోనీ.. ఎన్ని ప్రజా సమస్యలపై చర్చ సాగుతోంది? వంటి కీలక అంశాలను పరిశీలిస్తే.. తాజాగా జరుగుతున్న సమావేశాల్లో ఏ ఒక్క ప్రజా సమస్యా చర్చకు రావడం లేదు. పోనీ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, పరిష్కరించాల్సిన విషయాలు లేవా? అని అంటే .. అనేకం ఉన్నాయి. కానీ, ఏ ఒక్కటీ చర్చకు నోచుకోవడం లేదు. పైగా ఇప్పుడు ఏకైక విపక్షం వైసీపీ కూడా సభకు రావడం లేదు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో ఫిరాయించేలా ఆపరేషన్ చేపట్టారని ఆగ్రహించిన వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, సదరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆయన సభలను బహిష్కరించారు.
నలభై ఏళ్లు పూర్తయిన….
మరి ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ వేదిక పూర్తిగా అధికార పార్టీ స్వోత్క ర్షకు, బీజేపీ, వైసీపీలపై రాళ్లు వేసేలా పరనిందకు వినియోగించుకుంటున్నారు సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, సీఎం చంద్రబాబు. చంద్ర బాబు రాజకీ యాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దాదాపు నాలుగు రోజుల పాటు ఆయనను పొగిడే కార్యక్ర మాన్ని పెట్టుకున్నారు.సభకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ తమ పరిధులు దాటి.. వీలైనంతలో వీలైనంత ఎక్కువగా చంద్రబాబును వివిధ జాతీయ స్థాయి నేతలతో పోలుస్తూ.. మరీ ప్రముఖంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక, గత నాలుగు రోజులుగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దుమ్మెత్తి పోయడానికే సభా సమయం సరిపోవడంలేదని టీడీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రులతో వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
విజయసాయి విషయంలో…
అదేసమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎంవోకు వెళ్లారని, ప్రధాని నరేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ కోసం వేచి ఉన్నారని, అసలు ఆయనకు ప్రధానిని కలవాల్సిన అవసరం ఏముందని ఇలా ఓ రోజు రోజంతా అసెంబ్లీలో చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలు, మంత్రులు సభా సమయాన్ని వృథా చేసేశారు. ఇక, శనివారం నాటి సభా కార్యక్రమాన్ని చూసుకుంటే.. కేంద్రాన్ని విమర్శిస్తూ.. చంద్రబాబు రాసిన లేఖకు ప్రతిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాశారు.
ఇది పార్టీల సమస్యే కాదా?
ఇది నిజానికి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశం కాదు. రెండు పార్టీలకు చెందిన అంశం. అయితే, దీనిని కూడా చంద్రబాబు ప్రజా సమస్యగా మార్చేశారు. అమిత్ షా లేఖతో ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, ఏపీ ప్రజలకు మేం తప్ప దిక్కు దివానం ఎవరూ లేరనేంతగా ఆయన సభలో కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. అడిగేవారు(సభలో విపక్షం వైసీపీ) లేకపోతే.. అధికార పక్షం ఎంతగా రెచ్చిపోవాలో అంతగా రెచ్చిపోయిందనడానికి ఈ సమావేశాలే ఉదాహరణగా నిలుస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి తనను తాను పొగుడుకోడానికి, ఇతరులపై రాళ్లు రువ్వడానికి బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాగానే ఉపయోగపడుతోందని అంటున్నారు.
Leave a Reply