ఆంధ్రులు ఆరంభశూరులు.. మైకు వీరులేనా?

ఐకమత్యమంటే వారిదే. సంఘటిత శక్తి అంటే వారే. కష్టమైనా..నష్టమైనా…ఒక్కటిగా పోరాడటమే వారికి తెలుసు. తమ హక్కుల పరిరక్షణ కైనా..సంస్కృతీ, సంప్రదాయాల ను నిలబెట్టుకోవడం కోసమైనా సరే. ఒకే రకమైన తెగింపు. వారే తమిళియన్లు. ఒక సంప్రదాయం కోసం ఐక్యంగా పోరాడారు. ఒక సంస్కృతి కోసం ఒకే గొంతుతో నినదించారు. ఒక క్రీడ కోసం యావత్ రాష్ట్రం ఒక్కటయ్యింది. యువత, రాజకీయ పార్టీలు, సినిమా ఇండస్ట్రీ కలసి సాధించుకున్నాయి జల్లికట్టును. అది కేవలం సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం కోసమే అయినా…ఆ ఉద్యమ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్డినెన్స్ వచ్చే వరకూ కదలమంటున్నారు ఆందోళనకారులు. అదీ తమిళుల పట్టు.

ఎవరి రాజకీయాలు వారివే….
జల్లికట్టు కోసం తమిళులు పట్టిన ఉడుంపట్టు…కేంద్రాన్ని కదిలించింది. కాని తమిళనాడు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంస్కృతి, సంప్రదాయాలను పక్కన బెడితే… కేంద్రంతో తెగ్గొట్టాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సాధ్యం కాలేదు. ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక హోదాతో పన్ను మినహాయింపులు వస్తాయి. దానివల్ల పారిశ్రామికీకరణ జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రత్యేక హోదా దక్కకపోయినా ఏపీలో ఉద్యమం కొద్ది రోజులపాటే సాగింది. అదీ ఎవరికి వారే. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీ చాలని సరిపెట్టుకోగా….విపక్షాలు ఒక రోజు ఏపీ బంద్ ను ప్రకటించి ఊరుకున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన ఉద్యమం ఏపీలో అసలు కన్పించనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి జిల్లాల వారీ సభలు పెట్టడం మినహా మరేమీ చేయలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలకో.. రెండు నెలలకో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా కావాలని మళ్లీ షూటింగ్ లకు వెళ్లిపోతున్నారు. ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల మధ్యనే ఐక్యత లేదు. ప్రత్యేక హోదా కోసం ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రమే. ఏపీలో ఆంధ్ర, నాగార్జున, వెంకటేశ్వర యూనివర్సిటీల విద్యార్థులూ ప్రత్యేక హోదా కోసం పరితపించింది లేదు. ఇక విశాఖ రైల్వే జోన్ గురించి అడిగే వారే లేరు. ఉద్యమించే నేతలే కన్పించడం లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు డిమాండ్ చేయడం తప్ప ప్రజలను చైతన్యం చేసే దిశగా ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించడం లేదు. ఇక వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంపైనా మాట్లాడే నేతలే కరవయ్యారు.

విద్యార్థి లోకం ఏం చేస్తున్నట్లు…
తమిళనాడులో ఒక క్రీడ కోసం మొత్తం రాష్ట్రం ఏకమై సాధించుకుంటే… బతుకు దెరువు కోసం.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీలో ఇసుమంతైనా చలనం లేదనే చెప్పాలి. ఏ పార్టీ అయినా తన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది గాని… రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడుతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి సమస్యలపై ఉద్యమిద్దామని పిలుపు నిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని కూడా తెలిపారు. ఇక్కడి సమస్యలపై టాలివుడ్ హీరోలు కూడా స్పందించరు. తమ సినిమాలకు కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు కాని ఏపీలో సమస్యలు మాత్రం పట్టవు. తమిళనాడు అయితే అందరూ స్పందిస్తారు. ఇదెక్కడి చోద్యమంటున్నారు విశ్లేషకులు, అయితే ఆంధ్రులు ఆరంభశూరులు కదా?… తమిళనాట ఐక్యత ఇక్కడ సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పక్కనే ఉన్న తమిళనాడును చూసైనా నేర్చుకోవాల్సిందిగా ఏపీ రాజకీయ పార్టీలకు పలువురు సూచిస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగస్వాములుగా  ఉన్న ఆంధ్రులు ఆ పోరాట స్పూర్తిని మాత్రం వారసత్వంగా తెచ్చుకోలేకపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*