
అవును! ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఎక్కడి నుంచి వచ్చినా .. గొప్పలు చెప్పుకోవడం మాత్రం ఆపడం లేదు. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం మాదిరిగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఇన్నాళ్లు మోడీ అపాయింట్మెంట్ రాకపోవడంతో దీనిని కవర్ చేసుకునేందుకు టీడీపీ వాళ్లు ఎన్ని తిప్పలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరకు ఎట్టకేలకు బాబుకు మోడీ అపాయింట్మెంట్ వచ్చింది. దీనిని ఓ పెద్ద న్యూస్‌గా టీడీపీ వాళ్లు నానా హంగామా చేశారు. చంద్రబాబు మోడీతో భేటీ అవ్వకముందే ఆయన అన్నీ ఇచ్చేస్తారని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
సన్ రైజ్ స్టేట్ అంటూ….
మోడీతో భేటీ సందర్భంగా చంద్రబాబు ఏపీ సమస్యలపై కూలంకషంగా మోడీకి వివరించారు. సన్ రైజ్ ఏపీపై రూపొందించిన పుస్తకాన్ని కూడా ఆయన ప్రధానికి బహూకరించి శాలువా కప్పి సత్కరించారు. ఇంత వరకు బాగానే ఉంది. దాదాపు 40 నిముషాల పాటు ప్రధాని మోడీ.. బాబుతో భేటీ అయ్యారు. ఏం చర్చించారనేది బాబు వెర్షన్‌ను బట్టి మాత్రమే బయటకు వచ్చింది. పీఎంవో దీనిపై ఏ విధమైన ప్రకటనా జారీ చేయలేదు. అయితే, చంద్రబాబు మాత్రం భేటీ బాగుందని చెప్పుకొచ్చారు.
జగన్ మీద విరుచుకుపడి….
భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియా మీటింగ్ పట్టారు. మోడీతో భేటీ బాగా జరిగిందని, ఏపీ సమస్యలను పరిష్కరిస్తారన్న ఆశలు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా విపక్షం అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ పాదయాత్ర ప్రభావమేమీ లేదని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని తేలిగ్గా కొట్టిపారేశారు. ‘సమస్యలు పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామన్నారు. మరి అది ఏమైంది ? ఇప్పుడు రాజీనామా మాట మాట్లాడడం లేదేమి ? ఆయనకేమన్నా కేంద్రంతో సొంతపనులున్నాయా ?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని నిప్పులు చెరిగారు. కనీస సమస్యలపైనా జగన్ పోరు చేయడం లేదని అన్నారు. ఏపీలో విపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామని అన్నారు.
విపక్షం తామేనంటూ…
అంతేకాదు, ఈ సందర్భంగానే బాబు తనను తాను పొగిడేసుకున్నారు. బీజేపీతో తాము మిత్ర పక్షంగానే ఉన్నామని, అయినా కూడా విపక్షం మాదిరిగా కేంద్రంతో ఫైట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని తన లాగా ఒత్తిడి చేసేవారు ప్రపంచంలో లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏ విషయంలోనైనా తాను పట్టుబడితే సాధించి తీరతానని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఫైళ్లు పట్టుకుని అమెరికాలో ఫుట్‌పాత్‌లపై నడిచానని మరోసారి చెప్పుకొచ్చారు. చాలాకాలం తర్వా త తనను కలిసిన చంద్రబాబును ప్రధాని ఆప్యాయంగా పలకరించినట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్రబాబు తనకు తాను పొడుగుకోవడం మానడం లేదని అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో అరిగిపోయిన రికార్డును ఎన్నాళ్లు ప్లే చేస్తారని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు
Leave a Reply