ఆత్మకూరులో ఆదాల పక్కా స్కెచ్…. !

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గమంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆనం రామనారాయణరెడ్డి. నిన్నటి వరకూ ఆత్మకూరు నియోజకవర్గంపై అధికార తెలుగుదేశం పార్టీలో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. కానీ ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళ్లిపోతుండటంతో ఆత్మకూరు పార్టీలో హాట్ హాట్ గామారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన గూడూరి కన్నబాబును కట్ చేసేందుకు పార్టీలోని కొందరు వేగంగా పావులు కదుపుతున్నారు. ఆ పనిచేస్తుంది ఎవరో కాదు… పార్టీలో సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని తాత్కాలిక ఇన్ ఛార్జిగా నియమించడం తెలిసిందే. దీనిపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమరణ దీక్షకు దిగి రచ్చ రచ్చ చేసిన విషయమూ విదితమే. అయితే మంత్రి నారాయణ జోక్యంతో కన్నబాబు దీక్షను విరమించారు.

కన్నబాబును టార్గెట్ చేసి….

అప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి కన్నబాబును టార్గెట్ చేశారని చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. తనను ఇన్ ఛార్జిగా నియమించినందుకు నిరసనగా దీక్షకు దిగిన కన్నబాబును వచ్చే ఎన్నికల్లో కూడా దెబ్బకొట్టాలని, అస్సలు టిక్కెట్ రాకుండా చేయాలన్నది ఆదాల వ్యూహంగా కన్పిస్తోందంటున్నారు. ఇందుకు అనుగుణంగా వేగంగా ఆదాల పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆనం లాగే పార్టీ మారే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు జిల్లాలో ఆదాలకు ఇస్తున్న ప్రయారిటీ అంతా ఇంతా కాదంటున్నారు.

ఆ ఇద్దరినీ కలిపి…..

దీంతో ఆదాల తనకు నమ్మకమైన వారిని, పాత కాపులను మళ్లీ పార్టీలోకి తెచ్చి కన్నబాబుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇదే నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన కొమ్మి లక్ష్మినాయుడు, బొల్లినేని కృష్ణయ్యలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. వీరిద్దరిలో ఒకరికి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ ఇప్పించాలన్నది ఆదాల ప్రయత్నం. ఇప్పటికే వీరిద్దరితో ఆదాలు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబువద్దకూ తీసుకెళ్లారు. ఇద్దరూ పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్నారు. ఈవిషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఆయనకూడా ఆదాలను అభినందించినట్లు తెలుస్తోంది.

ఎవరు పోటీ చేసినా….

అయితే కొమ్మి లక్ష్మయ్యనాయుడికి ఆత్మకూరు టీడీపీ టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరు. గత ఎన్నికల్లో కొమ్మి లక్ష్మయ్యనాయుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బొల్లినేని కృష్ణయ్య పోటీ చేస్తానంటే టిక్కెట్ ఆయనకే ఇస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే పారిశ్రామికవేత్తగా ఉన్న కృష్ణయ్య ఈసారి పోటీకి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తాను వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని వస్తానని చంద్రబాబుకు బొల్లినేని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.కానీ చంద్రబాబు మాత్రం ఆయన్నే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మకూరులో గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కన్నబాబు మాత్రం ఈ విషయాలన్నీ తెలిసి భగ్గుమంటున్నారు. తనకు గెలిచే సత్తా లేకపోవచ్చు గాని, తనను మోసం చేసిన వారిని ఓడించే సామర్థ్యం ఉందని చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. ఇలా ఆత్మకూరు నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 23725 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*