ఆర్కే నగర్ ఎన్నికతో తేలిపోతుందా?

జయలలిత మరణించడంతో  ఖాళీ అయిన ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక తేదీ ఖరారుకావడంతో ప్రధాన పార్టీలూ  ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్కే నగర్ లో పోటీ చేసి విజయం సాధించాలని అధికార అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతోంది. అయితే ఎవరిని పోటీకి దింపాలన్న నిర్ణ‍యం ఇంకా తీసుకోకున్నా…టీటీవీ దినకరన్ ను పోటీ చేయించాలని శశికళ భావిస్తున్నారని సమాచారం. దినకరన్ ను పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ భాగస్వామిని చేయాలని చిన్నమ్మ యోచన. అయితే బెంగళూరు జైలులో ఉన్న చిన్నమ్మ ఆదేశం కోసం అన్నాడీఎంకే నేతలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే శశికళ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని చెప్పారు. దాదాపు దినకరన్ పేరునే ఖరారు చేసే యోచనలో అన్నాడీఎంకే పార్టీ నేతలు ఉన్నారు.

త్రిముఖ పోటీలో విజయం ఎవరిది?
ఇక జయలలిత మేనకోడలు దీప కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికలో బరిలోకి దిగుతానని ప్రకటించారు. దీప పోటీ చేస్తే పన్నీర్ సెల్వం వర్గం మద్దతు ప్రకటించే అవకాశముంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దీపను గెలిపించుకుని చిన్నమ్మ ఆధిపత్యానికి గండికొట్టాలని పన్నీర్ వర్గం భావిస్తోంది. ఇందుకోసం అమ్మ మరణంపై ఉన్న అనుమానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పన్నీర్ సిద్ధమవుతున్నారు. అలాగే ప్రతిపక్ష డీఎంకే కూడా ఆర్కే నగర్ ఎన్నికలో తమ అభ్యర్థిని బరిలోకి దించాలని డిసైడ్ అయింది. త్రిముఖ పోటీ నెలకొంటే తమదే గెలుపు ఖాయమన్న ధీమాను ఆ పార్టీ నేత స్టాలిన్ వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక అన్నాడీఎంకేలోని రెండు వర్గాలపై ప్రజల నమ్మకాన్ని, ఆదరణను తెలియజేస్తుందని భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*