ఆ 20 మంది కొట్టిన దెబ్బ జగన్ మర్చిపోలేకపోతున్నారా?

వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. టిక్కెట్ కావాలని అడిగి… తీరా గెలిచిన తర్వాత జంప్ అయ్యే వారిని ఇప్పటి నుంచే వడపోత చేయాలని ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ మీద నమ్మకంతోనూ, అభిమానంతోనూ ప్రజలు ఓట్లేస్తే అధికారం కోసం అర్రులు చాస్తూ అధికార పార్టీ వైపు వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని జగన్ ఇంకా మర్చిపోలేక పోతున్నారు. పార్టీ కోసం తన వెంట పడిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయాన్ని ఈ సందర్భంగా కొందరు నేతల వద్ద ప్రస్తావించారు. జలీల్ ఖాన్ తనకు టిక్కెట్ కావాలని తనవెంట పడి, అధికారంలోకి రాకపోయేసరికి అవతల పక్షంలో చేరడమే కాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని ఇటువంటి స్వభావం ఉన్న నేతలను ముందుగానే పసిగట్టి వారిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి టిక్కెట్ల పంపిణీలో జాగ్రత్తలు…..

వైసీపీ టిక్కెట్ ఇవ్వాలంటే ముందుగానే ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించాలని కూడా జగన్ సీనియర్ నేతలను కోరినట్లు తెలిసింది. ఇప్పటిలాగా జరగకుండా ముందుగానే పార్టీకి కట్టుబడే ఉండేవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రశాంత్ కిషోర్ ను కూడా సలహాలు కోరినట్లు తెలిసింది. అయితే టిక్కెట్ వచ్చే ముందు తాము సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఉంటామని అందరూ చెప్తారు. కాని ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకుంటే వలసలను ఎలా ఆపగలుగుతామని వైసీపీ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. అభ్యర్థులు గెలిచే అవకాశముంటే వారికే టిక్కెట్ ఇవ్వాలని, పార్టీ మారరని ఎలా నమ్మకం మనకు కుదురుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలుత ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు 20 మందిపై బలమైన అభ్యర్థులను దించాలని జగన్ భావిస్తున్నారు. అందుకోసం ఆ 20 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మరో రెండు సార్లు సర్వే చేసైనా సరైన అభ్యర్థులను సూచించాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ఆ 20 మంది జంప్ జిలానీలు వేసిన దెబ్బను ఇంకా మరిచిపోనట్లుంది. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ నేతలకు జగన్ సూచించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 35835 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*