ఇంటిపేరు గాంధీ…. అదేనా రాహుల్ నైజం?

రాహుల్ గాంధీ

అనర్గళ ప్రసంగాల్లో మోడీకి సమ ఉజ్జీ కాడు. రాజకీయ వ్యూహాల్లోనూ సరిపోడు. ఆడి తప్పడం, అడ్డదిడ్డంగా మాట్లాడటం చేత కాదు. అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెసుకు వారసుడు. గాంధీ ఇంటిపేరు, వారసత్వంతో పాటే కాంగ్రెసు పార్టీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, అవినీతి, అక్రమాల పాపం కూడా అతని భుజస్కంధాలపైనే పడింది. నిజానికి ముక్కుసూటి మనిషిగా పేరున్న రాహుల్ గాంధీ రాజకీయాల్లో రాణించడం చిన్నవిషయం కాదు. అడుగుకో అబద్దం చెప్పాలి. ఆకాశంలో చందమామను అందిస్తానంటూ హామీలివ్వాలి. బుజ్జగించాలి. బెదిరించాలి. ఓటర్లను ప్రలోభ పెట్టాలి. వడ్డించిన విస్తరిలా వారసత్వ పీఠం ఎదురుచూస్తున్నా రాహుల్ ఏమాత్రం ఆత్రపడకపోవడానికి ప్రధాన కారణం అతని వైఖరే. కావాలనుకుంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో నే క్యాబినెట్ లో చేరే అవకాశం ఉంది. అవసరమైతే ప్రధాని పదవిని కోరుకున్నా అడ్డు చెప్పేవారు లేరు. కానీ వేచి చూశాడు. తనకింకా అంత అనుభవం లేదని స్వయంగా అంగీకరించాడు. అధికారిక పదవులకు దూరంగానే ఉన్నాడు.

తల్లి చాటు బిడ్డగానే……

ఇప్పుడు కాంగ్రెసు చరిత్రలో ఎరుగని రీతిలో తీవ్రమైన అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్రాల వారీగా తుడిచి పెట్టుకుపోతోంది. మత సమీకరణతో దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం నానాటికీ దిగజారుతోంది. మోడీ శకం మొదలైంది. దీనికి అడ్డుకట్ట వేసే విశ్వసనీయమైన నాయకుడు ప్రధాన పార్టీల్లోనూ, ప్రాంతీయ పక్షాల్లోనూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీని తమ అధినాయకునిగానే చూస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఇంకా తల్లిచాటు బిడ్డ అనే పేరే ఉంది. ఈ నేపథ్యంలో రెండు వారాల అమెరికా పర్యటన వ్యక్తిగతంగా రాహుల్ కు అంతర్జాతీయంగా ఎక్స్ పోజర్ కు ఉద్దేశించిందనే చెప్పాలి. అంతేకాకుండా ఒక జాతీయ స్థాయి నేతగా బ్రాండింగుకు కూడా ఉపకరించేలా పర్యటనను రూపొందించారు. దేశంలో ఆయన పర్యటించినా పెద్దగా ప్రచారం లభించడం లేదు. పైపెచ్చు మీడియా పాక్షిక ధోరణుల ఫలితంగా పర్యటనల్లో చిన్నాచితక లోపాలకు విస్త్రుత ప్రచారం కల్పిస్తూ రాహుల్ అంటే నవ్వుల ముడిసరుకు(లాఫింగ్ స్టాక్)గా ముద్ర వేయడానికే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు భావి అధినేత (నవంబరులో అధ్యక్ష బాధ్యతలు చేపడతారనేది పార్టీ సమాచారం) తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని విపక్ష రాజకీయాలకు చుక్కానిలా వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్నామొన్నటివరకూ మోడీకి దీటుగా విపక్ష శిబిరం బరిలోకి దింపాలని చూసిన నితీశ్ కుమార్ ఎన్డీఏ లో చేరిపోయారు. బెంగాల్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ మమతా బెనర్జీ చంచల మనస్తత్వం, ఒంటెత్తు పోకడ, దూకుడు స్వభావం, అహంకారం ఆమెను ప్రధాని స్థాయికి తగరని తేల్చేశాయి. అందులోనూ సంకీర్ణ రాజకీయాలకు ఆమె ధోరణి ప్రధాన అడ్డంకి. మాయావతి సొంత దళిత సమాజంలోనే పూర్తిస్థాయి ఆదరణ,మద్దతును పోగొట్టుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ వంటి వారు కేసుల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. సమాజ్ వాదీలోనే ఆయన సొంత ముద్ర అడుగంటిపోతోంది.

ఇమేజ్ ను పెంచిన అమెరికా పర్యటన…..

అందువల్ల విపక్ష శిబిరానికి రాహుల్ మాత్రమే దిక్కు. వీటన్నిటినీ అంచనా వేసిన తర్వాత రాహుల్ వ్యక్తిత్వచిత్రణలో మార్పు కోసం వ్యూహాత్మకపర్యటనగా యూఎస్ ట్రిప్ ను తీర్చిదిద్దారనే చెప్పాలి. రాజీవ్ గాంధీకి సన్నిహితుడు, నాలెడ్జి కమిషన్ మాజీ అధ్యక్షుడు శాం పిట్రోడా నేతృత్వంలో ఈ పర్యటన రూపుదిద్దుకుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రసంగం, విద్యార్థులతో ముఖాముఖి, మేధోవర్గాలతో సమావేశం వంటివన్నీ భారతదేశం గురించి రాహుల్ గాంధీ ఆలోచనలను అంతర్జాతీయసమాజంతో పంచుకునేందుకు ఉద్దేశించినవి. తద్వారా తనను తాను భారత జాతీయ నేతగా ఆవిష్కరించుకునే ప్రయత్నం. ఈ విషయంలో రాహుల్ ప్రయత్నం, కాంగ్రెసు వ్యూహకర్తల శ్రమ ఫలించిందనే చెప్పాలి. ఎటువంటి మొహమాటం లేకుండా సొంత పార్టీ లోపాలను అంగీకరించడం, ప్రత్యర్థి అయినప్పటికీ మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రశంసించడం , బారత్ లో మోడీ హయాంలో చోటు చేసుకుంటున్న విపరీతాలను ఎండగట్టడం ఇలా సూటిగా స్పందించడం రాహుల్ కు ఇమేజ్ తెచ్చిపెట్టింది. మొత్తమ్మీద గతం కంటే రాహుల్ పరిణతి చెందారనే ప్రశంసలూ దక్కాయి. ప్రత్యేకించి భారతదేశంలోని మీడియా రాహుల్ పర్యటనకు మంచి ప్రాధాన్యం ఇవ్వడం , ఆయన ఆలోచనలను ప్రజల దృష్టికి తేవడం కూడా గమనించదగిన పరిణామంగానే చెప్పాలి. దిగ్విజయ్, అహ్మద్ పటేల్, గులాం నబీ వంటి పాతకాపులను దూరం పెడుతూ తన తరానికి చెందిన యువతకు పార్టీలో ప్రాముఖ్యం పెంచేందుకు ఇప్పటికే రాహుల్ కొన్ని చర్యలు తీసుకున్నారు. స్వీయ వ్యక్తిత్వ మార్పులనూ అలవరుచుకుంటున్నారు. కొద్దికొద్దిగా భారత రాజకీయాల్లోని సంక్లిష్టతపై అవగాహన పెంచుకుంటున్నారు. ఇవన్నీ దేశంలో ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయి. భిన్న కులాలు, మతాలు, సంస్క్రుతులు, ప్రాంతాలతో అలరారే భారత్ ఏకధ్రువ రాజకీయంలో కొట్టుకుపోకూడదు. ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెసు రూపుదాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు తగిన ఇమేజ్ మేకోవర్ దిశలో రాహుల్ పర్యటన దోహదం చేసిందనుకోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 39132 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on ఇంటిపేరు గాంధీ…. అదేనా రాహుల్ నైజం?

  1. ఉత్తరప్రదేశ్ ఫలితాల తర్వాత 6 నెలల్లోనే అంత పరిణితి కనిపించిందా మీకు??. అమెరికా పర్యటనలు అంత దోహదం చేశాయా?. ఎందుకండీ జనాల్ని అంత మభ్యపెట్టాల్ని చూస్తారు??. రాహుల్ మీద ఎందుకండీ మీకంత అభిమానం??. గాంధీ ఇంటి పేరున్నంత మాత్రాన, PM అయిపోడు సర్..వాజ్పాయీ, PVనరసింహారావు లాంటి దిగ్గజాల సరసన రాహుల్ ను ఎలా ఊహించుకోగలం sir..మోడీ, షా ద్వయం ఉన్నంత కాలం .. రాహుల్ PM గురించి మర్చిపోవడం మేలు.. అది దేశానికి చాల మేలు… ఇటువంటి అవాస్తవ కధనాలు వండి వద్దిచ్చాడ్డు sir.

Leave a Reply

Your email address will not be published.


*