ఇక యుద్ధ రామయ్యేనా?

sidharamaiah mandya constiuency

అసెంబ్లీ ఎన్నికల సమరానికి కర్ణాటక కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందస్తు వ్యూహ రచన చేస్తున్నారు. వచ్చే ఏడాది మే తో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్ కు ఎంత ప్రతిష్టాత్మకమో అదే సమయంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం విపక్ష భారతీయ జనతాపార్టీకీ అంతే ముఖ్యం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప పైనే కేంద్ర బీజేపీ పెద్దలు బాధ్యతలను మోపారు. మాజీ ప్రధాని మంత్రి హెచ్.డి.దేవగౌడ సారధ్యంలో జనతాదళ్ (ఎస్) తదితర పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంది.

1978 సీన్ రిపీట్ అవుతుందా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి అత్యవసరం. జాతీయ స్థాయిలో కుదేలైన ఆ పార్టీ అధినాయకత్వం ఈ దక్షిణాది రాష్ట్రంపై భారీ ఆశలే పెట్టుకుంది. కర్ణాటక విజయంతోనే కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభం అవుతుందన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటలు కాంగ్రెస్ శ్రేణులకు వీనుల విందు చేస్తున్నాయి. 1977లో కేంద్రంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయింది. అనంతరం 1978లో జరిగిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నాటి గెలుపు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ఊపిరి పోసింది. 1980లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. అప్పట్టో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏపీలో, దేవరాజ్ అర్స్ సారధ్యంలో కర్ణాటకలో పార్టీ విజయఢంకా మోగించింది. అప్పటిదాకా కీలకమైన ఒక్కలింగ, లింగాయత్ సామాజిక వర్గాలపైనే ఆధారపడిన కాంగ్రెస్ తొలిసారిగా దళితులు, మైనారిటీలు, ఓబీసీల ఓటు బ్యాంకుతో అధికారాన్ని అందుకుంది. 1978 మాదిరిగా ఇప్పుడు కూడా కర్ణాటక అసెంబ్లీ విష‍యంలో 2019లో సాధారణ ఎన్నికల్లో పార్టీ దూసుకుపోతుందన్న విశ్వసాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

దళిత, మైనారిటీ ఓటు బ్యాంకుపై దృష్టి………

224 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రస్తుత బలం 123 మంది. 44 స్థానాలతో బీజేపీ ప్రధాన విపక్షంగా ఉంది. 40 స్థానాలుగల జనతాదళ్ (ఎస్) రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో లేదు. కొన్ని ప్రాంతాలకు పరిమితమై అది ఉప ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నట్లే ఇక్కడ కూడా కుల రాజకీయాలదే పైచేయి. ప్రధానంగా ఒక్కలింగ, లింగాయత్ సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్య వర్గాలు. లింగాయత్ లు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పది అదే సామాజిక వర్గం. ఒక్కలింగల ఓటు బ్యాంకుపై జనతాదళ్ (ఎస్) ఆధారపడుతోంది. అలా అని ఈ రెండు సామాజిక వర్గాల నాయకులు కాంగ్రెస్ లో లేకపోలేదు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ లో చక్రం తిప్పిన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష‌్ణ ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. రెండు ప్రధాన సామాజిక వర్గాలూ దూరమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ 2013 లో సరికొత్త వ్యూహాన్ని రచించి విజయవంతమైంది. దళితులు, మైనారిటీలు ఇతర ఓబీసీల ఓటు బ్యాంకుపై దృష్టి సారించి వారిని తనవైపు తిప్పుకుంది. వెనుకబడిన కురుబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గత ఐదేళ్లుగా చక్రం తిప్పుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పై చేయిసాధించేందుకు సిద్ధరామయ్య ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదే పెద్దది. అధిష్టానం కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా కాకుండా, ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి లాగానే పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

భావోద్వేగాలను రెచ్చగొడుతూ……..

జాతీయ అంశాలను పక్కన బెట్టి భావోద్వేగాలను కలిగించే ప్రాంతీయ అంశాలకు ప్రాధన్యమిస్తూ విపక్షాలను ఇరుకున పెడుతున్నారు. మైసూరు జిల్లాకు చెందిన సిద్ధరామయ్య రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్న అనుభవజ్ఞులు. కాంగ్రెెస్ వ్యతిరేక రాజకీయాలతో ఎదిగిన ఆయన రెండుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అనంతర కాలంలో రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పుడు తన అనుభవసారంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో గతంలో జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటిన్లు తరహాలో ిఇటీవల ఇందిరమ్మ క్యాంటిన్లను ప్రారంభించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే పార్టీ వచ్చే ఎన్నికలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో అర్ధమవుతోంది. జనాన్ని ఆకట్టుకునే కార్యక్రమాలతో పాటు విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే కార్యక్రమాలను సిద్దరామయ్య చేపడుతున్నారు. ప్రజల్లో భావోద్వేగాలను కలిగించే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉంటే తప్పేమిటంటూ వివాదాన్ని రాజేశారు. బెంగళూరు మెట్రో బోర్డులో హిందీని వ్యతిరేకించడం, కన్నడ సంస్కృతిని చులకన చేసే విధంగా మాట్లాడవద్దంటూ కన్నడేతరులను హెచ్చరించడం, స్థానికులకు ఉద్యోగాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపడం, కొన్ని ఉద్యోగాలకు కన్నడ తప్పనిసరి అంటూ చట్టాలు చేయడం భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. హిందూ జాతీయ వాదాన్ని నినాదంగా తీసుకువస్తున్న బీజేపీని ప్రత్యేక కన్నడ నినాదంతో ఎదుర్కొనేందుకు సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా పరిగణించే లింగాయత్ లను కూడా తనవైపుకు తిప్పుకునేందుకు ఎత్తు వేశారు. లింగాయత్ పెద్దలు అంగీకరిస్తే లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించే ప్రక్రియను చేపడతానన్నారు. లింగాయత్ ల దైవమైన బసవన్న విశిష్టతను చాటే క్రమంలో కొందరు పీఠాధిపతులు తమది హిందూ మతానికి భిన్నమైనదని, సంస్కరణలకు ఆద్యులమని చెబుతూ తమది ప్రత్యేక మతంగా గుర్తించాలని గతంలో కోరుతుండేవారు. దానికి సీఎం సానుకూలంగా స్పందించడంతో ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు గల బీజేపీలో కలవరపాటు మొదలైంది.

బీజేపీ ఇక్కడ పాగా వేయాలని……….

విపక్ష బీజేపీ కూడా అధికార సాధనే లక్ష్యంగా శ్రమిస్తోంది. అవినీతిపరుడిగా ముద్రపడి జైలు కెళ్లినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పైనే బాధ్యతలను మోపింది. అనంతకుమార్, సదానందగౌడ వంటి కేంద్రమంత్రులున్నప్పటికీ ఆయన్నే నమ్ముకుంది. మాండ్యా జిల్లాకు చెందిన ఆయన మొదటి నుంచి జనసంఘ్ లో ఉన్నారు. అంతకు ముందు తాము పాలించిన రాష్ట్రాన్ని తిరిగి గెలిపించుకోవడం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందున్న పెద్ద సవాల్. జాతీయ స్థాయిలో దెబ్బతిన్న కాంగ్రెస్ ను రాష్ట్రంలో కూడా ఓడిస్తే ఆ పార్టీ దక్షిణాదిన కూడా కుదలవుతుందన్న అభిప్రాయంతో ఉంది. కర్ణాటకలో గెలుపు ద్వారా దక్షిణాదిన బలోపేతం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలోనే పార్టీ ఉనికి బలంగా ఉంది. ఇక్కడ గెలిస్తే పొరుగున ఉన్న తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళ పై కూడా ఆ ప్రభావం పడుతుంది. కర్ణాటక గెలుపు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. దాని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుంది. అందువల్లే రెండు జాతీయ పార్టీలూ రానున్న రోజుల్లో రాష్ట్రంపై మరింత దృష్టి సారించడం ఖాయం.

 

       – తెలుగుపోస్టు ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 35929 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*