ఇద్దరూ జగత్ చంద్రీలే…!

ఇద్దరిదీ ఒకే రాజకీయం. ఇద్దరి ఆకాంక్ష ఒక్కటే అది అధికారం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు అనుసరిస్తున్న విధానాలు ఏవగింపు కల్గిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై ప్రజల్లో బలంగా సెంటిమెంట్ ఉందని భావించిన రెండు పార్టీలు ఇప్పుడు హస్తినను వదిలేసి తమ కార్యక్షేత్రంగా ఏపీనే ఎంచుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా ఎవరికి వారే వ్యూహరచన చేస్తున్నారు తప్పించి కేంద్రంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపట్టడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకుకుంది.

పార్లమెంటు సమావేశాల సమయంలో….

పార్లమెంటు సమావేశాలు జరిగినంతవరకూ రెండు పార్టీలూ హస్తినలో హల్ చల్ చేశాయి. ఇటు పార్లమెంటులోనూ, అటు బయట ఆందోళనలు నిర్వహించి టీవీల ముందు హడావిడి చేశాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటును అడ్డుకోవడమే కాకుండా అవిశ్వాస తీర్మానాన్ని రోజూ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. తర్వాత ప్రధాని ఇంటి ముట్టడికీ పార్లమెంటుసభ్యులు ప్రయత్నించారు. అక్కడి నుంచి ఏపీకి వచ్చిన తర్వాత బస్సు యాత్ర చేద్దామనుకున్న టీడీపీ ఎంపీలు ఆ ఆలోచన ఎందుకో విరమించుకున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అియతే దీక్షలు, ధర్మపోరాట సభలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శులు ఉన్నాయి.

ఆమరణ దీక్ష చేసి….

ఇక వైసీపీ విషయానికి వస్తే…. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. ఆయన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. గత నెల 6వ తేదీన ఎంపీలు రాజీనామాలు చేశారు. నెల గడిచిపోయింది. అయినా రాజీనామాలు ఆమోదం పొందలేదు. రాజీనామాలు చేసి అక్కడే ఏపీ భవన్ లో ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ఆస్పత్రి పాలై ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ నేతలు కూడా దీక్షలతో, ఆందోళనలతో కాలయాపన చేస్తున్నారు.

ఓట్ల యావే తప్ప….

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ ల దృష్టి వచ్చే ఎన్నికల పైనే ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ పార్టీకి మైలేజ్ తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ను వేదికగా చేసుకుని పోరాటాలు చేస్తున్నారు. అయితే రెండు పార్టీలూ కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం వత్తిడి తేవాల్సిన తరుణంలో రాష్ట్రంలోనే ఓట్ల వేటలో పడ్డారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే తప్ప కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నది వాస్తవం. ఢిల్లీలో చూపించాల్సిన తమ సత్తాను ఏపీలో గాలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక హోదాను తామే తెస్తామంటూ బీరాలు పోతున్నారు. తాము అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందంటున్నారు తప్ప, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి వత్తిడి ఇద్దరూ తేవడం లేదన్నది వాస్తవం. అందుకే ఇద్దరూ జగత్ జంత్రీలేనన్నది ప్రజావాక్కు.

Ravi Batchali
About Ravi Batchali 40561 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*