ఇలాంటి సీఎం ఎక్కడా ఉండరు….!

ఇలాంటి ముఖ్యమంత్రులను మన దేశంలో చూడటం చాలా అరుదు. కాని ఉన్నారు… ముఖ్యమంత్రి అయినా…సామాన్య జీవితానికి అలవాటు పడటం ఈరోజుల్లో సామాన్య విషయమేమీ కాదు. ఆయనే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. మాణిక్ సర్కార్ వామపక్షాల భావాలకు ఆకర్షితుడై సీపీఎంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. అయినా ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అదీ ఆయన నైజం. ఆయన కుటుంబమూ అంతే. ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకుందామనుకునే ఈ రోజుల్లో ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పటికీ ఆయన సామాన్యుడే కావటం విశేషం.

ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే….

త్రిపుర శాసనసభ ఎన్నికలు జరగుతున్నాయి. మాణిక్ సర్కార్ ధన్ పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ రాష్ట్రం వామపక్షాలకు కంచుకోట. మళ్లీ మాణిక్ సర్కార్ నే విజయం వరిస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే..ఆయనను చూసి అందరు రాజకీయ నేతలు నేర్చుకోవాలని చెప్పకతప్పదు. ముఖ్యమంత్రిగా ఉన్నా సామాన్యుడిగా…సామాన్యుల సేవలోనే ఆయన గడుపుతుంటారు. ఆయనకు ధన వ్యామోహం లేదు. ఆస్తులు పెంచుకుందామన్న ఆలోచన కూడా లేదు. అందుకే ఆయనను నాలుగు దఫాల నుంచి త్రిపుర ప్రజలు తమ నేతగా ఎన్నుకుంటూ వస్తున్నారు.

జీతమంతా పార్టీకే….

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కల్గక మానదు. ఆయన ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఎందుకంటే ఆయనకు పరిమితికి మించి ఆదాయం లేదన్నమాట. ఆయన సమర్పించిన ఎన్నికల అఫడవిట్ ప్రకారం ఆయన వద్ద ఉన్న నగదు కేవలం 3,930లు మాత్రమే. చేతిలో ఉన్న సొమ్ము 1,520లు మాత్రమే. మిగిలిన 2,410లు బ్యాంకు పొదుపు ఖాతాలో ఉండటం విశేషం. ఇక ముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని సీపీఎంకు విరాళంగా మాణిక్ సర్కార్ గత కొన్ని ఏళ్ల నుంచి ఇస్తున్నారు. అయితే ఇందుకు ప్రతిగా మాణిక్ సర్కార్ కు సీపీఎం ప్రతి నెలా ఐదు వేల రూపాయల వేతనం ఇస్తుంది. పార్టీ నుంచి తీసుకునే ఐదు వేల వేతనమే ఆయన ఆదాయం. అంతకు మించి ఒక్క రూపాయి ఆదాయం కూడా మాణిక్ సర్కార్ కు లేదు.

భార్య సంపాదనే ఎక్కువ….

ఇక మాణిక్ సర్కార్ భార్య పాంచాలి భట్టాచార్య కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. భార్య పుట్టింటి నుంచి వచ్చిన 888.35 చదరపు గజాల స్థలమే ఆయన స్థిరాస్థి. ఆ స్థలంలో పదిహేను లక్షలు వెచ్చించి ఇల్లు కట్టించుకున్నారు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఎన్నికల అఫడవిట్ లో 21 లక్షలుగా మాణిక్ సర్కార్ చూపించారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయడంతో భార్య పాంచాలి భట్టాచార్యకు ప్రభుత్వ సొమ్ము లభించింది. పాంచాలి భట్టాచార్యకు రెండు బ్యాంకు ఖాతాలున్నాయి. అందులో నగదు ఉంది. అంతేకాదు ఆమెకున్న బంగారం కేవలం 20 గ్రాములే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులో 9లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఇదీ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆస్తిపాస్తులు. ఇలాంటి సీఎం మన దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటే… లేరనే గట్టిగా చెప్పొచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 30914 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*