ఈయనుంటే జగన్ సీఎం అయినట్లేనా?

ఎమ్మెల్సీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లే నడుచుకోవాలి. వైసీపీలో జగన్ తర్వాత స్థానాన్ని దక్కించుకున్న ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. జగన్ కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. విజయమ్మ ఇంటికే పరిమితమయ్యారు. షర్మిల రాజకీయాలను పట్టించుకోవడం లేదు. జగన్ బంధువులైన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిని కూడా జగన్ ప్రకాశం జిల్లాకే పరిమితం చేశారు. గత కొద్ది రోజులుగా వైసీపీలో విజయసాయి రెడ్డి హవాయే నడుస్తుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. జగన్ కూడా ఎక్కువగా విజయసాయిరెడ్డిపైనే ఆధారపడుతున్నారు. ఆర్థికంగానే కాకుండా రాజకీయపరమైన సలహాలు కూడా విజయసాయిరెడ్డి నుంచే తీసుకుంటున్నారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీలోకి తీసుకురావడంలో కూడా విజయసాయి రెడ్డి ముఖ్యపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జగన్ చేసే దీక్షలు, మహాధర్నాలు, ప్లీనరీ ఏర్పాట్ల వంటి వాటిని విజయసాయి రెడ్డి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. గతంలో జగన్ ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులు వంటి వారిపైనే ఎక్కువగా ఆధారపడే వారు. కొన్ని కీలక అంశాలను వారితోనే చర్చించేవారు. కాని ఇప్పుడు ఆ స్థానాన్ని విజయసాయి రెడ్డి దక్కించుకున్నారు.

వైసీపీలో నెంబర్ 2 ఈయనే…….

విజయసాయిరెడ్డి తనకు అత్యంత నమ్మకస్తుడు కావడంతో ఆయనను రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏపీలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆయన చెప్పినట్లే పార్టీలో నడుస్తుంది. విజయసాయిరెడ్డి సౌమ్యుడు. వచ్చిన వారితో చాలా మృదువుగా మాట్లాడతారు. సమస్యలను కూడా చాలా చక్కగా డీల్ చేయగల సామర్ధ్యం ఉన్న నేత అని వైసీపీ నేతలే చెబుతున్నారు. జిల్లాలో ఉన్న విభేదాలను కూడా సాయిరెడ్డే పరిష్కరిస్తున్నారు. చిన్న విషయాలను జగన్ వద్దకు వెళ్లకుండా ముందుగానే ఆయన పరిష్కరిస్తున్నారు. పార్టీ ఆర్థిక వ్యవహారాలతో పాటుగా పార్టీ సమస్యలను కూడా చక్కగా డీల్ చేస్తుండటంతో జగన్ విజయసాయిరెడ్డికి అగ్రస్థానం కట్టబెట్టారు. ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా జగన్ కు క్షణాల్లో సాయిరెడ్డి అందిస్తున్నారు. ఇక ఢిల్లీ వ్యవహారాలను కూడా సాయిరెడ్డి చక్కగా ట్యాకిల్ చేశారు. ఇటీవల ప్రధాని మోడీని జగన్ కలవడం ఒక్క సాయిరెడ్డికి తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మోడీతో భేటీని సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేశారు విజయసాయి రెడ్డి. అంతేకాకుండా ఎక్కడకు జగన్ వెళ్లాలన్నా ముందుగానే విజయసాయిరెడ్డి వెళ్లి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటుగా అక్కడ నేతలతో భేటీ అయి పార్టీ సమస్యలను పరిష్కరిస్తుండటంతో పార్టీలో సాయిరెడ్డి ప్రాధాన్యత అమాంతంగా పెరిగిపోయింది. దీంతో నేతలు కూడా ఎక్కువగా విజయసాయిరెడ్డిని కలవడానికే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా జగన్ ను సీఎంను చేసే సమర్ధత, చాకచక్యం సాయిరెడ్డిలో ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తనతో పాటు కోర్టుకేసుల్లో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన విజయసాయి రెడ్డిని సహజంగానే జగన్ దగ్గరకు తీశారు. అయితే జగన్ దగ్గర బంధువుల ఒకరిద్దరు సాయిరెడ్డిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద వైసీపీలో జగన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానం విజయసాయి రెడ్డి రూపంలో దొరికింది. మరి జగన్ ను సీఎంను చేసే బాధ్యత సాయిరెడ్డి తీసుకున్నారేమో.

Ravi Batchali
About Ravi Batchali 29065 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*