
పశ్చిమ గోదావరి జిల్లా విషయంలో చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎవరిని నిర్ణయించాలన్న దానిపై బాబు ఇంకా ఒక నిర్ణయానికి రావకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఎక్కువ మంది నేతలు ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆశిస్తుండటం, వారందరూ టీడీపీ కోసం కష్టపడి పనిచేసి ఉండటం చంద్రబాబుకు ఎంపిక కష్టంగా మారిందని చెబుతున్నారు. అంతేకాకుండా గత సాధారణ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ టీడీపీకి ఇచ్చిన ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ విజయానికి నేతలు కూడా కారణం కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై బాబు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
కంచుకోటలో ఎవరికి?
2014 ఎన్నికల్లో కంచుకోటగా మారిన టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించింది. అయితే దాదాపు 30 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన వారే. అయితే చంద్రబాబు వీరిలో ఎవరికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తారా? అని ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు టెన్షన్ తో ఉన్నారు. నిన్న జరిగిన పొలిట్ బ్యూరోలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని జిల్లాల్లో చంద్రబాబుకు ఎంపిక విషయంలో ఇబ్బందులు ఎదురుకాలేదు. కాని పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి ఆయన కూడా ఒకింత ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
అందరూ కష్టపడ్డ వాళ్లే…
పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఈ జిల్లా నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగానే కన్పిస్తోంది. అధికారంలో లేని పదేళ్లూ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. కొందరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెబితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు పోటీ నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. వీరందరిలోనూ తమకే ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం వస్తుందన్న ధీమా కన్పిస్తోంది. అలాగే చంద్రబాబు వెంట పాదయాత్ర చేసిన వారు కూడా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణ కు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పింది అధిష్టానం. పైగా ఆర్యవైశ్య కులానికి చెందిన వారు కావడంతో తనకే వస్తుందన్న ధీమా అంబికా కృష్ణ లో కన్పిస్తోంది. మరోవైపు ఓసీ కులానికి చెందిన పాందువ శ్రీను కు లోకేష్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. లోకేష్ కూడా శ్రీనుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్న అంగరి రామ్మోహన్ తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే తణుకు కు చెందిన వావిలాల సరళాదేవి బీసీ కోటాలో తనకు కేటాయించాలని గట్టిగా కోరుతున్నారు. అలాగే తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా తనకు ప్రయారిటీ ఇవ్వాలని కాపు కోటా కింద ముఖ్యమంత్రిని కోరారు. అయితే ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఇదే విషయంపై రగడ జరిగింది. మరి ముఖ్యమంత్రి ఎవరి పేర్లను ప్రకటిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో చంద్రబాబు జాబితాను ప్రకటించే అవకాశముంది.
Leave a Reply