ఈ టీడీపీ నేత బాబును థిక్కరిస్తున్నారా?

తెలుగుదేశం

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఎదురు తిరుగుతున్నారా? అనంతపురంలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. అనంతపురం జిల్లా జడ్పీ ఛైర్మన్ గా పరిటాల అనుచరుడు చమన్ ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తయింది. ఆయన తర్వాత మరో నేత పూల నాగరాజు పదవిని చేపట్టాల్సి ఉంది. ఇటీవల అనంతపురం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు చమన్ కు పదవికి రాజీనామా చేయాలని సూచించారు. గత కొంతకాలంగా రాజీనామా చేయకుండా నానుస్తూ వస్తున్న చమన్ అధినేత అడగటంతో అంగీకరించారు. అయితే తనకు జూన్ 15వ తేదీ వరకూ సమయం ఇవ్వాలని కోరగా అందుకు చంద్రబాబు అంగీకరించారు. అయితే చమన్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చమన్ ను జడ్పీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు జిల్లా ఎమ్మెల్యేలంతా పరిటాల సునీతకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. దీంతో చంద్రబాబు కూడా చమన్ ను రాజీనామా చేయాలని సూచించారు.

పదవిని వదులుకునేందుకు ససేమిరా…..

అయితే చమన్ మాత్రం జడ్పీ ఛైర్మన్ పదవిని వదులుకోవడానికి ఇష్టపడటంలేదు. ఈ మేరకు తన అనుచరులతో పూల నాగరాజు తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఎన్నికకు అయిన ఖర్చు మొత్తాన్ని తాను ఇస్తానని జడ్పీ ఛైర్మన్ పదవి రేసు నుంచి తప్పుకోవాలని పూల నాగరాజును కోరడంతో ఆయన అందుకు ఒప్పుకోలేదు. పైగా ఈ విషయాన్ని పార్టీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని చమన్ రెండున్నరేళ్లు, పూలనాగరాజు రెండున్నరేళ్లు పంచుకోవాలని ముందుగానే పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. అయితే రెండున్నరేళ్లు అయినా చమన్ పదవికి రాజీనామా చేయకపోవడంతో ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికే రెండున్నరేళ్లు పూర్తయింది. కాని చమన్ పదవిని వదలకుండా అలానే ఉన్నారు. చంద్రబాబు వద్ద అంగీకరించిన చమన్ ఇంకా పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జడ్పీ ఛైర్మన్ గా తననే కొనసాగించాలని సామాజిక వర్గం కార్డును చమన్ ఉపయోగిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చమన్ రాజీనామా చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబుకు అనంతపురం సమస్య మళ్లీ తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*