ఈ బెజవాడ నేతకు జగన్ టిక్కెట్ ఇవ్వరా?

ఏపీ రాజ‌ధానికి కేంద్రంగా ఉన్న బెజ‌వాడ పేరు చెపితే మ‌న ముందు ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజ‌కీయాలు మెదులుతాయి. మూడున్నర ద‌శాబ్దాల క్రితం బెజ‌వాడ‌ను వంగ‌వీటి, దేవినేని ఫ్యామిలీలే అప్రతిహ‌తంగా శాసించాయి. ఆ త‌ర్వాత ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఆ వార్ ఫ్యాక్షన్ వార్‌గాను, పొలిటిక‌ల్ వార్‌గాను మారింది. ఈ రెండు కుటుంబాల‌కు అంత చ‌రిత్ర ఉంది. ఇక వంగ‌వీటి పేరు చెపితే తెలుగు జ‌నాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గంలో అదిరిపోయే క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌కు దివంగ‌త మాజీ నేత వంగ‌వీటి మోహ‌న‌రంగానే కార‌ణం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి రంగా వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి కేవ‌లం 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన ఆయ‌న త‌న‌యుడు వంగ‌వీటి రాధా పొలిటికల్ కెరీర్ ఎటు వెళుతుందో ? కూడా ఎవ్వరికి తెలియ‌డం లేదు. రాజకీయంగా ఆయ‌న ప‌దే ప‌దే వేస్తోన్న రాంగ్‌స్టెప్పులు ఆయ‌న్న అధః పాతాళానికి ప‌డిపోయేలా చేశాయి.

ప్రారంభం ఘ‌నం…ప్రస్తుతం పాతాళం ….

రంగా త‌న‌యుడిగా పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించిన రాధా 2004లో కాంగ్రెస్ త‌ర‌పున విజ‌య‌వాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కేవ‌లం 26 సంవ‌త్సరాల వ‌య‌స్సులో రాధా ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ్వడం గ్రేటే. త‌ర్వాత 2009లో వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నా విన‌కుండా సామాజిక‌వ‌ర్గం నేప‌థ్యంలో చిరు ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసి సెంట‌ల్ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి మ‌ల్లాది విష్ణు చేతిలో 500 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చిన రాధా గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి మ‌రోసారి ఓడిపోయారు. దీంతో రాధా ప్రభావం క్రమ‌క్రమంగా మ‌స‌క‌బారుతూ వ‌స్తోంది.

రాధాకు షాకిచ్చిన జగన్….

కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న రాధాను స‌డెన్‌గా త‌ప్పిస్తూ జ‌గ‌న్ పెద్ద షాకే ఇచ్చారు. ఆ బాధ్యత‌ల‌ను ఆయ‌న మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు అప్పగించారు. అక్కడే రాధాకు పెద్ద షాక్ త‌గిలింద‌నుకుంటే ఆయ‌నకు ఇష్టంలేక‌పోయినా త‌న‌పై గెలిచిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును పార్టీలోకి తీసుకోవ‌డంతో పాటు న‌గ‌రంలో కీల‌క బాధ్యత‌లు అప్పగించారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే రాధా ఇమేజ్ ఎంత దారుణంగా ప‌డిపోయిందో చెప్పేందుకు తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే నిద‌ర్శనంగా నిలుస్తోంది. రాధా నియోజ‌క‌వ‌ర్గంలో ఓ డివిజ‌న్‌లో పార్టీ ప్రెసిడెంట్ పోస్టును జ‌గ‌న్ నియమించ‌డం అంద‌రూ షాక్ గుర‌వుతున్నారు. ఇక్కడ నాగూర్ అనే మైనార్టీ వ్యక్తిని జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున డివిజ‌న్ ప్రెసిడెంట్‌గా నియ‌మిస్తే జ‌గన్ డెసిష‌న్‌తో నాగూర్‌ను త‌ప్పించి మ‌రో వ్యక్తికి అక్కడ బాధ్యత‌లు అప్పగించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఓ డివిజ‌న్ ప్రెసిడెంట్‌ను కూడా నియ‌మించుకోలేని రాధాకు అస‌లు పార్టీలో ఎలాంటి జీరో ఇమేజ్ ఉందో క్లీయ‌ర్ క‌ట్‌గా తెలిసిపోతోంది.

పొలిటిక‌ల్‌గా ఎన్నో రాంగ్ స్టెప్పులు…

రాధాకు స‌రైన గైడెన్స్ లేక‌పోవ‌డంతో పాటు రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌డంతో ఎన్నో రాంగ్ స్టెప్పులు వేశాడు. 2009లో వైఎస్ మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ కాద‌ని ప్రజారాజ్యంలోకి వెళ్లి సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సెంట్రల్‌లో వంగ‌వీటి ఫ్యామిలీకి ఎంతో క్రేజ్ ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో సెంట్రల్ కాద‌నుకుని తూర్పుకు మారి వైసీపీ నుంచి పోటీ చేసి మ‌ళ్లీఓడారు. ఇక తూర్పులో ఓడిన రాధా మ‌ళ్లీ త‌న‌కు సెంట్రల్ సీటే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అక్కడ‌కు వెళ్లి ఇన్‌చార్జ్‌గా కొన‌సాగుతున్నారు. ఇలా ప‌లు పార్టీలు మార‌డంతో పాటు నియోజ‌వ‌ర్గాలు కూడా మార‌డం ఆయ‌న కెరీర్‌ను పాతాళంలో ప‌డేసింది.

గౌత‌మ్‌రెడ్డి మ్యాట‌ర్‌తో మ‌రింత గ్యాప్‌…

ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయిన పూనూరు గౌత‌మ్‌రెడ్డి జ‌గ‌న్‌కు బంధువు. కొద్ది రోజుల క్రితం గౌత‌మ్‌రెడ్డి రంగాను తిట్టడంతో పెద్ద అగ్గిరాజుకుంది. చివ‌ర‌కు వంగ‌వీటి అభిమానులు పార్టీకి మైన‌స్‌గా మారుతున్నార‌ని గ్రహించిన జ‌గ‌న్ గౌత‌మ్‌రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అయినా గౌత‌మ్‌రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాల్లో మామూలుగానే పాల్గొంటున్నాడు. వైసీపీ బ్యాన‌ర్లు, జ‌గ‌న్ ప‌క్కన త‌న ఫొటోతో ఫ్లెక్సీలు వేసుకుంటున్నాడు. తాజాగా గౌత‌మ్‌రెడ్డి క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డితో ఉన్న ఫొటోలు నెట్టింట్లో బ‌య‌ట‌కు రావ‌డంతో రాధా మ‌రింత‌గా ర‌గిలిపోతున్నాడు. దీనిని బ‌ట్టి త‌న‌కు ద‌గ్గర బంధువు అయిన గౌత‌మ్‌రెడ్డిని జ‌గ‌న్ వ‌దులుకోలేద‌ని అర్థమ‌వుతోంది. ఈ విష‌యంలో రాధా అగ్గిమీద గుగ్గిలమ‌వుతున్నాడు.

2019లో ఎమ్మెల్యే సీటు క‌ష్టమే..

ఇదిలా ఉంటే పార్టీలో రోజు రోజుకు వంగ‌వీటి ప్రయారిటీ త‌గ్గించేస్తోన్న జ‌గ‌న్ ఆయ‌న్ను పొమ్మన‌కుండా పొగ‌పెట్టే చందంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌న్నది ప‌రిణామాలే చెపుతున్నాయి. న‌గ‌ర పార్టీ అధ్యక్ష బాధ్యత‌ల నుంచి త‌ప్పించ‌డం, ఇప్పుడు తాను నియ‌మించిన ఓ డివిజ‌న్ ప్రెసిడెంట్‌ను కూడా త‌ప్పించ‌డం చూస్తుంటే వంగ‌వీటి త‌న‌కు అక్కర్లేద‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జ‌గ‌న్ ఓ డివిజ‌న్ ప్రెసిడెంట్ విష‌యంలో జోక్యం చేసుకున్నాడంటే వంగ‌వీటిని జ‌గ‌న్ ఎంత లైట్ తీస్కొంటున్నాడో తెలుస్తోంది. ఇక ప్రస్తుత ప‌రిణామాలు చూస్తుంటే రాధాను బ‌ల‌వంతంగా అయినా వ‌దిలించుకోవాల‌ని జ‌గ‌న్ చూస్తున్నట్టే క‌న‌ప‌డుతోంది. ఒక‌వేళ రాధా పార్టీలో ఉన్నా ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు క‌ష్టమే. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో స్టేట్‌లో ఎక్కడా లేని విధంగా 40 వేల బ్రాహ్మణ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఉన్నారు. దీంతో ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీటుపై జ‌గ‌న్ నుంచి హామీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పోనీ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన తూర్పు నుంచి పోటీచేద్దామ‌ని చూస్తున్నా ఈ సారి జ‌గ‌న్ ఆ సీటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వాళ్లకు ఇవ్వాల‌ని చూస్తున్నారు. ప్రస్తుతం విజ‌య‌వాడ తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్‌గా కార్పొరేట‌ర్ బొప్పన భావ‌కుమార్ ఉన్నారు. భావ‌కుమార్‌కు కాని ప‌క్షంలో మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌విని అయినా పార్టీలోకి తీసుకువ‌చ్చి తూర్పు నుంచి పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రయారిటీ ఇవ్వాల‌ని భావిస్తోన్న జ‌గ‌న్ తూర్పును క‌మ్మకే ఇవ్వనున్నార‌ని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాధాకు సీటు రావడం క‌ష్టంగానే కనిపిస్తోంది. ఓవ‌రాల్‌గా అయితే వైసీపీలో జ‌గ‌న్ రాధాను పొమ్మన‌లేకుండా పొగ పెడుతున్నార‌న్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 29095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*