ఉండవల్లి…ఊసరవెల్లి కాదు….!

ఉండవల్లి అరుణ్ కుమార్. రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏ పార్టీలో చేరకుండా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధించడంలో దిట్ట. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యులుగా చేరారు. దీంతో ఉండవల్లి జనసేనకు దగ్గరవుతున్నారన్న ప్రచారం జరిగింది. అలాగే జనసేనాని సాయంతో రాజ్యసభకు వెళ్లాలని ఉండవల్లి ప్రయత్నిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. పవన్ కల్యాణ్ తో చేరిన వెంటనే ఉండవల్లి తన స్టాండ్ మార్చుకుంటారని అందరూ భావించారు.

స్టాండ్ మార్చుకోకుండా…..

అయితే ఉండవల్లి తన స్టాండ్ మార్చుకోలేదని మరోసారి రుజువు చేసుకున్నారు. సహజంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనసేన టీడీపీపై విమర్శలు చేయకుండా తప్పించుకుంటుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. టీడీపీపై చేయాల్సిన విమర్శలు జనసేనాని ప్రతిపక్ష పార్టీపై చేయడం ఏంటని నెటిజన్ల ప్రశ్నలు కూడా ఎక్కువయ్యాయి. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ తో జత కట్టిన ఉండవల్లి సయితం టీడీపీ పట్ల సానుకూల ధోరణినే అవలంబిస్తారని అందరూ అనుకున్నారు. కాని తాను ఏ పార్టీకి చెందిన వాడినికాదని ఉండవల్లి మరోసారి నిరూపించారు.

పవన్ స్టేట్ మెంట్ కు విరుద్ధంగా…..

కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సవాల్ విసిరిన గంటల్లోనే ఉండవల్లి అవిశ్వాసం పెట్టాల్సింది టీడీపీయేనని తేల్చి చెప్పడం విశేషం. అంతేకాదు చంద్రబాబు ఆఖరి అస్త్రంగా అవిశ్వాసం పెట్టాలని చెబుతున్నారని అందులో వాస్తవం లేదని చెప్పారు. ఇదే చివరి బడ్జెట్ సమావేశం కనుక ఇక పోరాడినా సాధించేదేమీ లేదన్నారు ఉండవల్లి. రాజీనామాలు కూడా డిమాండ్ల సాధనకు పరిష్కారం కావన్నారు. పార్లమెంటులో ఆందోళన చేసినా ఫలితం ఉండదన్నారు. అందువల్లనే అవిశ్వాసం పెడితేనే చర్చకు వచ్చి కేంద్ర ప్రభుత్వం అసలు రూపం బయటకు వస్తుందని బంతిని చంద్రబాబు కోర్టులోకి నెట్టేశారు. అంటే జేఎఫ్ సి లో ఉన్నప్పటికీ పవన్ కు పూర్తి విరుద్ధంగా ఉండవల్లి ఈ ప్రకటన చేయడం విశేషం.

క్లారిటీ ఉందన్న ఉండవల్లి…..

ఇక పవన్ కల్యాణ్ విషయంలోనూ ఉండవల్లి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాను పవన్ తో రాజకీయ సంబంధమైన విషయాలను చర్చించలేదని చెప్పారు. కేవలం ఏపీ హామీల విషయంలోనే తమ మధ్య చర్చ జరిగిందని చెప్పారు. జేఎఫ్ సి తో పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా… వాస్తవాలు బయటకు వచ్చే అవకాశముంటుందన్నారు. అయితే పవన్ కల్యాణ్ ను మాత్రం ఒకింత వెనకేసుకొచ్చారు ఉండవల్లి. పవన్ ఎవరో చెబుతున్నట్లు ఆడుతున్నారని తాను అనుకోవడం లేదన్నారు. టీడీపీతో సఖ్యతగా ఉండాలనుకుంటే తనకు ఆహ్వానం ఉండేదే కాదని ఉండవల్లి కొట్టిపారేశారు. మొత్తం మీద ఉండవల్లి పవన్ కల్యాణ్ జేఎఫ్ సి లో చేరినా తన స్టాండ్ ను మాత్రం మార్చుకోలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 30209 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*