
విపక్ష పార్టీగా ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా అధికార పార్టీని ఇరుకున పెట్టే పని చేయాలి తప్పితే.. తాము ఇరుక్కునే పనిచేస్తే.. ఎలా ఉంటుంది? ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలను అడిగితే బాగా తెలుస్తుంది. వారు ఉండేది కాంగ్రెస్‌లో అయితే.. మెచ్చుకుని మాత్రం అధికార టీఆర్ ఎస్ పథకాలను! ఇలానే జరిగిపోయింది ఈ ఏడాది మొత్తం. దీనికి తోడు పార్టీలో కొరవడిన సమన్వయం కూడా నేతలను దూరం చేసి.. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చింది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం రావడం లేదని మీడియా మొత్తుకున్న నేతలు.. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన పథకాలను ముఖ్యంగా మిషన్ భగీరథ వంటి పథకాన్ని మెచ్చుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఎవరికి వారే తమకు తామే అనుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌ను అన్ని విధాలా నష్ట పరిచిందని చెప్పడంలో సందేహం లేదు.
బాహుబలి ఎవరనేది….
ముఖ్యంగా తన సీటును కాపాడుకోవడంలోనే ఈ ఏడాది తొలి ఆరు మాసాలు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ పీఠంపై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్‌కు పక్కలో బల్లెంగా మారారు. ఎప్పుడు ఏ వార్త ఢిల్లీకి చేరుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక, జానా రెడ్డి, డీకే అరుణలు తమ తమ ఆధిపత్యం కోసం పార్టీలోనే లొల్లికి సిద్ధమయ్యారు. ఇక, ఈ క్రమంలోనే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ విషయం వాతావరణాన్ని మరింత గరం గరంగా మార్చింది. కాంగ్రెస్‌కు బాహుబలి అంటూ మీడియా చేసిన ప్రచారంపై జానా నేరుగా విమర్శించడం పార్టీలో నెలకొన్న అసంతృప్తిని బయట పెట్టింది. ఇక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా.. ప్రతి ఒక్కరినీ ఇంటింటికీ వెళ్లి పిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీడియా సాక్షిగా వాపోయారు ఉత్తమ్ కుమార్.
బలపడాల్సిన సమయంలో….
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలపడాల్సిన కాంగ్రెస్ ఆదిశగా చేస్తున్న ప్రయత్నాలకు నేతలు పెద్దగా పాటించడం లేదనే విమర్శలూ వస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన నేతలు.. తమ తమ పదవుల కోసం వెంపర్లాడుతుండడం మరో ముఖ్య విషయంగా 2017లో కనిపించింది. ముఖ్యంగా ఆలు లేదు చూలు లేదు.. అన్న చందంగా సీఎం సీటుకోసం నువ్వా నేనే అనే ధోరణి ఈ ఏడాది బలపడింది. మాజీ మంత్రి జానా రెడ్డి, సర్వే సత్యానారాయణ, జే గీతా రెడ్డి, జైపాల్ రెడ్డి వంటి వారు సీఎం సీటు కోసం తమ తమ ఊహల్లో తేలిపోయారు. నిజానికి పార్టీని బలోపేతం చేసుకుని కదా.. ఇవన్నీ జరగాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. అదంతా పార్టీ చూసుకుంటుందిలే! అనే సమాధానం ఇచ్చిన వారు కూడా ఉన్నారంటే.. పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది.
వీరిది మరో దారి….
ఇక, కోమటిరెడ్డి రెడ్డి వెంకట రెడ్డి బ్రదర్స్‌ది మరో దారి. అందరూ వారు చెప్పిందే వినాలనే టైపులో కాంగ్రెస్‌లో ఉంటారా? ఊడతారా? అనే స్థితిని కల్పించి ఎటూ దారిలేక, రాక ఇక్కడే ఉండిపోయిన నేతలు. ఇక, ఇటీవల కాంగ్రెస్‌లోకి చేరిన రేవంత్ అధికార పక్షంపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రేవంత్‌కు మద్దతుగా ఎవరైనా గళం విప్పతున్నారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. అది తప్పే అవుతుంది. ఎందుకంటే… అంత పెద్ద సమన్వయం టీ కాంగ్రెస్‌లో ఉందని ఎవరైనా భావిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ను తక్కువ అంచనావేసినట్టే!! సో.. ఎడ్డెం అంటే తెడ్డెంగా టీ కాంగ్రెస్ ఉంది మరి!!
Leave a Reply